నాణ్యత ఉత్తుత్తే | The quality of the place | Sakshi
Sakshi News home page

నాణ్యత ఉత్తుత్తే

Published Thu, Dec 11 2014 1:46 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

The quality of the place

యూనివర్సిటీ: అనంతపురం జేఎన్‌టీయూ వ్యవహారం పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనే చందాన తయారైంది. సాంకేతిక విద్య బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామన్న మాటలు నీటి మూటలవుతున్నారుు. జేఎన్‌టీయూ, అనుబంధ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికన భోదన సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో తాత్కాతిక ప్రాతిపదికన సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. ఏటా బీటెక్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం గణనీయంగా తగ్గిపోతున్నా, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మరో వైపు ఐఐటీ ముంబై తరహాలో క్లాస్‌రూం కాంప్లెక్స్‌ను రూ.16.07 కోట్ల వ్యయంతో ఆధునాతనంగా నిర్మించాలని తలపెట్టినా రెండు సార్లు టెండర్లు రద్దు చేశారు. దీంతో అది కార్యరూపం దాల్చలేదు.
 
 అభివృద్ధి పనులకు ఆమడ దూరం
 అనంతపురం జేఎన్‌టీయూ కళాశాలలో వివిధ విభాగాలు, ల్యాబ్ సౌకర్యాలు వేర్వేరుగా ఉండడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో క్లాస్ రూం కాంప్లెక్స్‌ను ఐఐటీ ముంబై తరహాలో ఒకే చోట నిర్మించ తలపెట్టారు. ఈ క్రమంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లను పిలిచారు.
 
 ఈ టెండర్లపై నిష్ణాతులైన బిల్డింగ్ కమిటీ సభ్యుల ద్వారా విధివిధానాలు రూపొందించారు. తొలి దఫా పిలిచిన టెండర్లలో యూరో కన్‌స్ట్రక్షన్ కంపెనీకి టెండర్లు గడువు ముగిసిన ఆఖరి రోజున కంపెనీ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. టెండర్లు ఇస్తే రిజిస్ట్రేషన్ గడువును పొడగించుకుంటామని సదరు కంపెనీ ప్రతినిధులు కోరినప్పటికీ సాంకేతిక కారణాలు తలెత్తుతాయని జేఎన్‌టీయూ బిల్డింగ్ కమిటీ తేల్చి చెప్పడంతో టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది.
 
  రెండో దఫా టెండర్లు రాజకీయ ఒత్తిళ్లతో ఆపివేశారనే విమర్శలున్నాయి. ఈ -ప్రొక్యూర్‌మెంట్లలో నిర్దేశించిన విధానాలను మారిస్తే తమకు అనుకూలమైన కంపెనీలకు టెండర్లు కట్టబెట్టవచ్చనే ఉద్దేశంతో టెండర్లను తరచూ వాయిదాలు వేయిస్తున్నారు. పైకి యూజీసీ నిధుల లేమి దృష్ట్యా అభివృద్ధి పనులను ఆపివేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, నిధులు లేకుండా జేఎన్‌టీయూ టెండర్ల ప్రక్రియకు వెళ్లిన సందర్భాలు లేవు.
 
 జనవరిలోగా ప్రకటనలు జారీ చేయాల్సిందే
 జేఎన్‌టీయూ (ఏ)వీసీగా ఆచార్య కే.లాల్‌కిశోర్ పదవీ కాలం వచ్చే ఏడాది జూన్30న ముగియనుంది. వీసీ తన పదవీ కాలం ముగిసే ఆరునెలల లోపు ఏ విధమైన ఉద్యోగాల భర్తీ చేయకూడదని ఉన్నత విద్యా మండలి ముఖ్య కార్యదర్శి గతంలో స్పష్టం చేశారు. జేఎన్‌టీయూలో ఖాళీగా ఉన్న, కొత్తగా బోధనా పోస్టులు భర్తీ చేసుకోవడానికి మానిటరింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ (ఎం.ఎన్.డీ.సీ) అనుమతులు మంజూరు చేసింది.
 
  160 బోధన పోస్టులు భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర ఆర్థిక శాఖకు అనుమతులు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్స్‌ను తగిన విధంగా కేటాయించలేదనే నెపంతో పోస్టులు భర్తీ చేయకుండా వాయిదా వేస్తున్నారు. అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నూతనంగా భర్తీ చేసే ఉద్యోగాలకు 90 శాతం, 10 శాతం జీతాలను మొదటి ఐదేళ్లలో భరిస్తుంది. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభంలోగా ఖాళీగా ఉన్న, నూతనంగా మంజూరైన ఉద్యోగాలను భర్తీ చేయకపోతే యూజీసీ నిధులను ఆపివేస్తామని హెచ్చరించింది. ఉన్నత విద్యా మండలి చెర్మైన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్ రెడ్డి గత వారంలో ఎస్కేయూ పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా యూజీసీ సూచనలను పరిగణలోకి తీసుకుని, జేఎన్‌టీయూలో భోదన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. జేఎన్‌టీయూకు రాష్ట్ర ప్రభుత్వం అందించే బ్లాక్‌గ్రాంట్స్ పై ఆధారపడక్కరలేదని, వర్సిటీ అంతర్గత వనరులు పుష్కలంగా ఉన్నందున భర్తీకి ఆటంకాలు ఉండబోవని స్పష్టం చేశారు. రాజకీయ జోక్యాలకు తలొగ్గకుండా అభివృద్ధి కార్యక్రమాలు, బోధన పోస్టులు భర్తీ చేసి సాంకేతిక విద్య పటిష్టతకు చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement