ఎన్నికలు ఏవైనా సరే ఫలితాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. జిల్లా ప్రజలు మరీ ముఖ్యంగా పట్టణవాసులు వైఎస్సార్‌సీపీకి ‘ఫ్యాన్స్’గా ఉండటంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు.
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికలు ఏవైనా సరే ఫలితాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. జిల్లా ప్రజలు మరీ ముఖ్యంగా పట్టణవాసులు వైఎస్సార్‌సీపీకి ‘ఫ్యాన్స్’గా ఉండటంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. సాధారణ ఎన్నికల కంటే ముందే మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఆ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. కడప పార్లమెంటు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ ఎన్నికలతోబాటు సహకార సంఘాలు, పంచాయతీ ఎన్నికలు ఇలా ఏవైనా సరే జిల్లాలో ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారు.
క్రమం తప్పకుండా ఆ పార్టీ మద్దతుదారులను గట్టెక్కిస్తూ వస్తున్నారు. త్వరలో సాధారణ ఎన్నికలు తెరపైకి రానున్న నేపథ్యంలో ఎలా గట్టెక్కాలో తెలియని స్థితిలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలున్నారు. అంతలోనే తెరపైకి పురపాలక ఎన్నికలు వచ్చి కూర్చున్నాయి. ఈ ఎన్నికలు రాజకీయ పక్షాలకు సెమీ ఫైనల్స్‌లా నిలుస్తున్నాయి. ఆమేరకు అభ్యర్థుల అన్వేషణలో నిమగ్నమయ్యారు. వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తుంటే తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయండంటూ బతిమలాడాల్సిన పరిస్థితులున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊసే ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
భారీ మెజార్టీ అందించిన ప్రజానీకం
జిల్లాలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో గతంలో జరిగిన పలు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు భారీ మెజార్టీ అందించడంతో తెలుగుదేశం పార్టీ పోటీకి జంకుతున్నట్లు తెలుస్తోంది. కడప పార్లమెంటు ఎన్నికల పరిధిలో ప్రొద్దుటూరు నియోజక వర్గంలో 74,771 ఓట్ల మెజార్టీ వైఎస్సార్‌సీపీకి దక్కింది. రాజుపాళెం, రూరల్ మండలాలను మినహాయిస్తే మున్సిపాలిటిలోనే దాదాపు 60వేల ఓట్ల ఆధిక్యత ఆ పార్టీ సొంతమైంది. అలాగే కడప కార్పొరేషన్ పరిధిలో 67,785 ఓట్ల ఆధిక్యత వైఎస్సార్‌సీపీకి దక్కింది.
అప్పటి కంటే ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు మరింత ప్రతికూలంగా ఉన్నాయని పరిశీలకుల అంచనా. మైదుకూరు నియోజకవర్గంలో 70,147 ఓట్ల ఆధిక్యతను, జమ్మలమడుగులో 67,483 ఓట్లు, పులివెందులలో 1,08,177 ఓట్ల ఆధిక్యతను, రాయచోటిలో 56,891 ఓట్లు, బద్వేల్ నియోజకవర్గంలో 61,463 ఓట్ల ఆధిక్యత వైఎస్సార్‌సీపీ సొంతమైంది. ఆ ఎన్నికల్లో పట్టణ ప్రజలు ప్రధాన భూమిక పోషించారు. గ్రామాల కంటే పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరగడమే అందుకు నిదర్శంగా పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పురపాలక ఎన్నికలు వైఎస్సార్‌సీపీకి నల్లేరు మీద నడక లాగానే ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెరపైకి విభజన అంశం....
రాష్ట్ర విభజన అంశం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెరపైకి వస్తుండటంతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేసేందుకు స్థానిక నేతలు విముఖత చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు సిద్ధమైతే అడ్డుకోవాల్సిన ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం తెలంగాణకు అనుకూలంగా నిలిచింది. దీంతో ఆపార్టీ కేడర్ పూర్తి నిస్పృహలో ఉండిపోయింది.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే అజెండాగా వైఎస్సార్‌సీపీ నిలిచింది. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించి రెండు ప్రాంతాల్లోనూ పార్టీని భ్రష్టు పట్టించారని పార్టీ శ్రేణులు మథనపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పోటీ చేయాలంటే అభ్యర్థులు ముందుకు రాని దుస్థితి నెలకొందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.