పెదపులిపాక క్వారీలో తిరిగి ఇసుక బుకింగ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
పెదపులిపాక(పెనమలూరు) : పెదపులిపాక క్వారీలో తిరిగి ఇసుక బుకింగ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వ్యాపారులు మీ సేవలో హడావిడిగా బుకింగ్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం గతంలో 2.22లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఇసుక క్వారీలకు నూతన విధానాన్ని ప్రకటించింది. ఈ విధానాన్ని ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్న నేపథ్యంలో ఇంకా లక్షా నాలుగు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉండగానే అమ్మకాలు నిలిపివేసింది. మీసేవాలో గత 6వ తేదీ నుంచి ఇసుక బుకింగ్ నిలుపుదల చేశారు. ఇసుక కొరత ఏర్పడింది.
తాజాగా ప్రభుత్వం పెదపులిపాక క్వారీలో 50 వేల క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఇచ్చింది. రెండు రోజుల్లోనే 22వేల క్యూబిక్ మీటర్లకు బుకింగ్ జరిగింది. ఇంకా 28 వేల క్యూబిక్ మీటర్ల బుకింగ్ జరగాల్సి ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలకు ఈ క్వారీ నుంచే వెళ్లటంతో ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం క్యూబిక్ మీటర్‌కు రూ.550 చొప్పున లారీకి రూ.3300 వసూళ్లు చేస్తున్నా బహిరంగ మార్కెట్‌లో ఇసుక లారీ రవాణాతో కలిపి ధర రూ.6 వేల నుంచి ఆరున్నర వేలు ధర పలుకుతుంది. ప్రభుత్వం ఇసుక కృత్రిమ కొరత సృష్టించక పోతే ఇసుక సమస్యలు తలెత్తకుండా ఉంటుంది.