నిధులున్నాయి. వారి దరికి చేరవు. పథకాలుంటాయి ఆచరణలో పడకేస్తాయి. ఇదీ ఏళ్లుగడుస్తున్నా మారని బడుగువర్గాల బతుకులు. వారికోసం రూపొందించిన ఆర్‌జీజీవై (గ్రామీణ విద్యుద్దీకరణ యోజన) పథకం ఎందుకో తెలియని దుస్థితి. పాలకుల కరుణకు నోచుకోని దుర్గతి. అడవి తల్లి ఒడిలో విసిరేసినట్లున్న చెంచు గూడేలను ఇరవైనుంచి ఏభై వంతున ఒక చోటకు చేర్చి విద్యుద్దీకరణకు అనువుగా మార్చాలని కాగితాల్లో రాసుకున్నా ఆచరణలో చెల్లుచీటీ అవుతోంది.
పాలమూరు, న్యూస్‌లైన్ : చెంచు గూడేల్లో చీకట్లు తొలగడం లేదు. తమ బతుకుల్లో వెలుగు నింపాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు వారు మొరపెట్టుకున్నా.. అది అరణ్య రోదనగానే మారుతోంది. మరో వైపు గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, బీసీ కాలనీలు, గిరిజన తండాలు చీకట్లోనుంచి వెలుతురులోకి రాలేకపోతున్నాయి. పాలకుల అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఆర్‌జీజీవై పథకానికి శాపమవుతోంది. ఆర్‌జీజీవై అమలులో భాగంగా.. విద్యుత్ శాఖ అధికారులు రూపొందించిన అంచనాల ప్రకారం జిల్లాలోని 936 గిరిజన తండాలు, ఎస్సీ, వెనుకబడిన తరగతుల కాలనీలు విద్యుత్ సౌకర్యానికి నోచుకోలేదు. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ.. గృహ వినియోగానికి ఇచ్చే కనెక్షన్‌లు కాకుండా వ్యవసాయ విద్యుత్ లైన్ (హెచ్‌టీ లైన్)ల నుంచి అనధికారింగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా గిరిజనులు తండాలు, కాలనీల్లో ఏళ్లతరబడి చీకట్లోనే మగ్గుతున్నారు. గిరిజన ఆవాస ప్రాంతాల్లో నివసించే ప్రజలు రాత్రయిందంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు.
నిధులు కొరవడి...
రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజన (ఆర్‌జీజీవై) పథకాన్ని 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం దారిద్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంతోపాటు అన్ని గ్రామాలకు, ఆవాసాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇవ్వగా మిగిలిన 10 శాతం డిస్కమ్‌లు భరిస్తాయి. ఈ పథకాన్ని 2011 వరకు కొనసాగించాల్సి ఉండగా, మహానేత మరణానంతరం 2010 డిసెంబర్‌లో ఆర్‌జీజీవై పథకానికి ప్రభుత్వం పుల్‌స్టాప్ పెట్టింది. జిల్లాలోని మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, జడ్చర్ల, నాగర్‌కర్నూల్ డివిజన్లకు ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ పథకం ద్వారా కేవలం 1,17,025 మంది లబ్ది పొందినట్లు రికార్డులే సాక్ష్యమిస్తున్నాయి.
తండాలు...తంటాలు
మహబూబ్‌నగర్, జడ్చర్ల, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ విద్యుత్ డివిజన్‌లకు సంబంధించి చాలాచోట్ల విద్యుత్ సౌకర్యంలేక జనం ఇబ్బంది పడుతున్నారు. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజక వర్గాలలోని చెంచుల పెంటలు చీకట్లోనే మగ్గుతున్నాయి. నల్లమల అడవుల్లోని కండ్లకుంట, గీచుగండి, పర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, ఆగర్లపెంట, రాంపూర్, అప్పాపూర్, బౌరాపూర్, మేడిమల్కల, ఈర్లపెంట, సంగడిగుండాలు, తాటిగుండాలు, పందిబొర్రె తదితర చెంచుపెంటలకు కరెంటు సౌకర్యం అంటే ఏంటో తెలియదు. ఒక్కో దగ్గర 20 నుంచి 50 వరకు బొడ్డు గుడిసెలతో ఉండే పెంటలన్నింటినీ అప్పాపూర్ దగ్గరికి చేర్చి ఓ గ్రామంగా మార్చి వారికి విద్యుత్ సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అటవీశాఖ నిబంధనలతో ఆగిపోయింది. ఇటూ ఒక దగ్గరకు రాక... కరెంటు లేక వీరి పరిస్థితి ఆగమ్యగోచరమవుతోంది. రాత్రివేళ చెంచులు బొడ్డు గుడిసెలో కట్టెల మంటలు(నెగడు) పెట్టి కాలం వెల్లదీస్తున్నారు.
అమలుకు నోచుకోని పథకం
Published Sat, Dec 14 2013 4:04 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement