విద్యాలయాలు దేవాలయాలతో సమానమని పెద్దలు చెబుతుంటారు. ఇందుకు భిన్నంగా దేవాలయమే విద్యాలయంగా మారిన వైనమిది.
విద్యాలయాలు దేవాలయాలతో సమానమని పెద్దలు చెబుతుంటారు. ఇందుకు భిన్నంగా దేవాలయమే విద్యాలయంగా మారిన వైనమిది. సాక్షాత్తు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బోరంపల్లి గ్రామంలో తరగతి గదులు లేక ఆలయంలోని చెట్టు కింద చదువుకుంటున్న విద్యార్థుల దుస్థితిది.
కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్ : కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బోరంపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో తరగతి గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ 123 మంది విద్యార్థులున్నారు.
ఒకటి నుంచి 8 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో ఉన్న మూడు భవనాలలో రెండు కూలి పోగా, ప్రస్తుతం ఒకే గది ఉంది. ఈ ఒక్క గదిలో ఎనిమిది తరగతులు నిర్వహించడం అసాధ్యం. గత జూన్ 28న భవన పైకప్పు కూలి పలువురు విద్యార్థులు సైతం గాయపడిన సంగతి తెలిసిందే. ఆ రోజు రాజీవ్ విద్యా మిషన్ పీఓ రామారావు, తహశీల్దార్ మహబూబ్‌బాషా, ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఎంఈఓ కుల్లాయప్ప, ప్రజాప్రతినిధులు సంఘటన స్థలాన్ని పరిశీలించి అదనపు భవనాలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు.
మళ్లీ ఇటు తిరిగి చూడలేదు. దీంతో గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలోని చెట్ల కింద, పక్కనే ఉన్న కల్యాణ మంటపంలో తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షం వస్తే పాఠశాలకు సెలవే. త్వరలో నాలుగు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని ఎంఈఓ కుల్లాయప్ప చెప్పారు. రాష్ట్రంలో అత్యంత కీలక మైన రెవిన్యూ మంత్రిగా ఉన్న స్థానిక శాసనసభ్యుడు రఘువీరారెడ్డి సైతం ఈ పాఠశాల గురించి పట్టించుకోక పోవడం అన్యాయమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.