
సాక్షి, మంగళగిరిటౌన్: గత ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన టీడీపీ ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలను విస్మరించిందనే మాటలు సామాన్య జనం నోటి నుంచే వినిపిస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని మరోమారు కుట్రలకు అధికార పార్టీ తెరదీస్తుందని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రజల భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించి అపప్రథను మూటగట్టుకున్నారు. సంక్షేమ పథకాల అమల్లో అర్హులకు తీరని అన్యాయం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ మభ్య పెట్టడానికి వస్తున్న చంద్రబాబును నమ్మేదిలేదని జనాలు చెబుతున్న మాటలు...
కాపీ బాబూ ఎలా నమ్మాలి?
వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పింఛను అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకి చేయడమే కాకుండా రూ.2వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు చంద్రబాబు రూ.2వేలు ఇస్తున్నారు. సీనియర్ నాయకుడినని చెప్పుకోవడమే కాకుండా, ఎదుటి వారి మానిఫెస్టోను కాపీ కొట్టిన చంద్రబాబును ఏ విధంగా నమ్మాలి?
–కొంకి రాంబాబు, మంగళగిరి
ప్రజలకు మస్కా
వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో జరిగిన ప్లీనరీ సందర్భంగా సామాజిక భద్రతా పింఛన్లను రూ.2వేలు చేస్తామని ప్రకటిస్తే, అసాధ్యమని చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు అవహేళనగా మాట్లాడారు. అయితే ఎన్నికలు సమీపించే కొద్దీ చంద్రబాబు నాయుడు పింఛను మొత్తాన్ని రూ.2వేలు ఇస్తున్నారు. ఎలా సాధ్యం? వైఎస్సార్ సీపీ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొడుతూ ప్రజలను మరో మారు మస్కా కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలెవరూ నమ్మే ప్రసక్తి లేదు.
– డోకిపర్తి శ్రీనివాసరావు
రానున్నది రాజన్న రాజ్యమే
చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా రానున్నది జగనన్న సారథ్యంలోని రాజన్న రాజ్యమే. సార్వత్రిక ఎన్నికలు గెలవడానికి ఎన్ని ఎత్తులైనా వేస్తారు. డేటా చోరీ కుంభకోణం బట్టబయలైంది. ఐటి గ్రిడ్‌కు రాష్ట్ర ప్రజల సమాచారం ధారాదత్తం చేసే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారు? ఇలాంటి నీచమైన చర్యలకు ఒడిగట్టే చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు.
–పరసా రంగనాథ్, బీసీ నేత
హామీలేమయ్యాయి?
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా రుణాల మాఫీ అంటూ చంద్రబాబు అనేక హామీలు కురిపించారు. అధికారంలోకి రాగానే పూర్తిగా విస్మరించారు. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు రావడంతో మళ్లీ బూటకపు హామీలిస్తూ మరోమారు మోసాలు చేయడానికి సిద్ధమయ్యారు.
–మునగాల చంద్రశేఖర్