శ్రీకాకుళంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాజధాని అమరావతిలో తగిన సౌకర్యాలు లేకే ఏడాదికొక జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇలా ఏడాదికో జిల్లాలో వేడుకలు నిర్వహించడం వల్ల ఆ జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. గత నాలుగేళ్లుగా కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో నిర్వహించిమని చెప్పారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం నిర్వహించిన 72వ స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్, డీజీపీ ఆర్‌పీ ఠాకూర్ స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని వివిధ పోలీసు బెటాలియన్లు, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కేడెట్లు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రంలో విశిష్ట సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా 46 పేజీల ప్రసంగ పాఠాన్ని సీఎం చదివి వినిపించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, లక్ష్యాల గురించి వివరిస్తూనే మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆరోపణల వర్షం కురిపించారు. తాను అమెరికా వెళ్లినా అన్నదాతకు ఏవిధంగా సాయం చేయాలనే నిరంతరం ఆలోచిస్తానంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా రూ. 24 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశానన్నారు.
గిరిజన ప్రాంతాల్లో ‘గిరి ఆహార భద్రత’ కింద 1.91 లక్షల గిరిజన కుటుంబాలకు నెలకు రూ. 460 చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన డ్వాక్రా పొదుపు సంఘాలు ఇప్పుడు కోటిమంది సైన్యంగా మారినట్లు చెప్పారు. వైద్యరంగంలో తమ ప్రభుత్వ కృషి ఫలితంగానే ప్రజల ఆరోగ్య రక్షణ తలసరి వ్యయం(ఓవోపీఈ) 79 శాతానికి తగ్గిందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక డిజిటల్ లిటరేట్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారుకావాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు 57 శాతం పూర్తి చేసినట్లు చెప్పారు. మొత్తం 56 ప్రాజెక్టుల్లో 29 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కరవు రహిత రాష్ట్రంగా మార్చడానికే రెయిన్‌గన్ టెక్నాలజీ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. వంద శాతం ఇళ్లకు 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేస్తున్న కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటన్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చినా ఇసుక ఉచితంగా ఇస్తున్నామన్నారు.
మోదీ మోసం చేశారు...
ఢిల్లీని తలదన్నే రాజధానిని కట్టిస్తానని తిరుపతిలో వెంకన్న సాక్షిగా చెప్పిన నరేంద్ర మోదీ ఇప్పుడు మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. విభజన చట్టంలోని 18 అంశాలూ నెరవేర్చలేదని చెప్పారు. 11 రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక హోదాను మన రాష్ట్రానికి మాత్రం పెడచెవిన పెట్టారని విమర్శించారు. విశాఖ రైల్వేజోన్‌ను రాజకీయ కారణాలతో తొక్కిపట్టారన్నారు. కడప ఉక్కు కర్మాగారానికి భూములిచ్చినా, ఇనుప ఖనిజం చూపించినా అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని చెప్పారు.
సెర్ప్ శకటానికి ప్రథమ బహుమతి...
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అలాగే వివిధ ప్రభుత్వ విభాగాల శకటాలు ఆకట్టుకున్నాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం(సెర్ప్) శకటానికి ప్రథమ స్థానం దక్కింది. పర్యాటకం, గృహనిర్మాణ శాఖల శకటాలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పితాని సత్యన్నారాయణ, జిల్లాకు చెందిన మంత్రులు కళావెంకటరావు, అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎంపీ రామ్మోహన్‌నాయుడులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం పది గంటల వరకూ ఏకధాటిగా శ్రీకాకుళంలో కురిసిన వర్షానికి మైదానం పూర్తిగా చిత్తడిగా మారింది. వర్షంలోనే కార్యక్రమం కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment