డీసీసీ బ్యాంకు చైర్మన్ ఆంజనేయులు
వేముల/సాక్షి, కడప : టీడీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను తిప్పి కొడతామని, కుటిల రాజకీయాలు ఎంతో కాలం సాగవనే విషయం తెలిసి వచ్చేలా చేస్తామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ నారుబోయిన ఆంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు వేములలో విలేకరులతో మాట్లాడారు. దువ్వూరు సొసైటీలో టీడీపీ నీచ రాజకీయాలకు తెర తీసిందని దుయ్యబట్టారు. పదవీ వ్యామోహంతోనే ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డిని పదవి నుంచి తప్పించేందుకు అక్కడి డెరైక్టర్లను టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు. జిల్లాలోని రైతులందరికీ దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. సహకార సొసైటీలను అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని చెప్పారు. అందరినీ కలుపుకు వెళుతూ కేంద్ర సహకార బ్యాంకు అభివృద్ధికి పాటుపడతానన్నారు.
వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటా..
తన ఎదుగుదలకు కారణమైన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని నారుబోయిన అంజనేయులు కృతజ్ఞతలుతెలిపారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, వేముల మండల కన్వీనర్ నాగెళ్ల సత్య ప్రభావతమ్మ, పార్టీ నేత వైఎస్ భాస్కర్‌రెడ్డి, ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు ఈసీ గంగిరెడ్డి, నాగెల సాంబశివారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
బాధ్యతల స్వీకరణ
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న నారుబోయిన ఆంజనేయులును.. డీసీసీ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాలని శుక్రవారం డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు వేములకు చేరుకొని ఆర్డర్ కాపీ అందజేశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ వాహనంలో కడపకు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కాగా డీసీసీ బ్యాంకు చైర్మన్‌గా ఉన్న ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి దువ్వూరు సొసైటీలో ఏడుగురు డెరైక్టర్లు గురువారం రాజీనామ చేయడంతో పదవిని కోల్పోయారు. దీంతో వేల్పుల సొసైటీ పరిధిలోని వేముల డెరైక్టర్‌గా గెలుపొంది డీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్న ఆంజనేయులుకు ఈ పదవి దక్కింది. వేముల వాసి డీసీసీ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డెరైక్టర్ నుంచి చైర్మన్ వరకు ఎదిగిన వైనం
అదృష్టం అంటే ఇదేనేమో. కలలో కూడా ఊహించకుండానే పదవి ఇంటికి వచ్చింది. వ్యవసాయం చేసుకొనే ఆంజనేయులకు అనుకోని రీతిలో అదృష్టం వరించింది. 2013లో వేల్పుల సహకార సొసైటీ పరిధిలో వేముల నుంచి పోటీ చేసి డెరైక్టర్‌గా గెలుపొందారు. అప్పట్లో పులివెందుల ప్రాంతానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఆంజనేయులకు డీసీసీబీ వైస్ చైర్మన్ పదవిని అప్పజెప్పారు.వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆంజనేయులు తనకున్న పొలంలో పంటలు పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆంజనేయులుకు ఇద్దరు సంతానం. ఒకరు వేముల, మరొకరు వేంపల్లెలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఊహించని పరిణామాల మధ్య ఆంజనేయులకు పదవి రావడంతో కుటుంబ సభ్యులు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు.
కుట్ర రాజకీయాలు ఎంతో కాలం సాగవు
Published Sat, Apr 11 2015 4:02 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement