dcc bank
-
పంట రుణాలు రెన్యువల్ చేసుకోవాల్సిందే
రాజంపేట రూరల్: డీసీసీ బ్యాంకులో లోన్ తీసుకున్న రైతులందరూ తక్షణమే రెన్యువల్ చేసుకోవాలని డీసీసీబీ సీఈఓ ఏ.జయరామిరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్జీఓ హోమ్‌లో డివిజన్ స్థాయి డీసీసీ బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజంపేట డివిజన్‌కు రుణమాఫీ వర్తించడం లేదన్నారు. పండ్ల తోటలకు అందచేస్తామన్న రుణమాఫీ రూ.10వేలు ఇంకా మంజూరు కాలేదని వెల్లడించారు. రైతులు తక్షణమే తమ పంట రుణాలను రెన్యువల్ చేసుకుంటే 0శాతం వడ్డీ పడుతుందన్నారు. ఒక సంవత్సరం దాటిన లోన్లకు 13శాతం వడ్డీ పడుతుందని తెలిపారు. ప్రభుత్వం అందచేసే రుణమాఫీ అర్హులైన వారికి అందితే అది వారి అకౌంట్లోనే జమ అవుతుందన్నారు. అందువలన రైతులకు వడ్డీ భారం తగ్గుతుందన్నారు. జిల్లాలో రూ.225కోట్లు క్రాఫ్ లోన్లు అందచేశామన్నారు. అందులో రూ .158 కోట్ల రుణం వరకు రెన్యువల్ అయిందన్నారు. మిగిలిన రూ.73కోట్లు క్రాఫ్లోన్లు కూడా రైతులు రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు. రాజంపేట డివిజన్ పరిధిలోని రాజంపేట, పుల్లంపేట, కోడూరు, చిట్వేలి పరిధి లో సుమారు రూ.11కోట్లు మేరకు రైతులు ఇంకా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉందన్నారు. రైతులు తమ వద్దనున్న రికార్డులు, వన్‌బీ, అడంగల్, డిక్లరేషన్‌ను అందజేయాలని సూచించారు. లక్షరూపాయలు వరకు రెన్యువల్ చేసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ఎం.ప్రభాకర్‌రావు, ఏజీఎం టీవీ సుబ్బారెడ్డి, సబ్ డివిజనల్ కో-ఆర్డినేటర్ కె.సుబ్బరాయుడు, రాజంపేట సీనియర్ ఇన్స్పెక్టర్ శెట్టెం వెంకటరమణ, డివిజన్ పరిధిలోని 8బ్రాంచ్‌లకు చెందిన డీసీసీబీ బ్యాంకు మేనేజర్లు, సూపర్వైజర్లు, సంఘాల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు పాల్గొన్నారు. -
కుట్ర రాజకీయాలు ఎంతో కాలం సాగవు
డీసీసీ బ్యాంకు చైర్మన్ ఆంజనేయులు వేముల/సాక్షి, కడప : టీడీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను తిప్పి కొడతామని, కుటిల రాజకీయాలు ఎంతో కాలం సాగవనే విషయం తెలిసి వచ్చేలా చేస్తామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ నారుబోయిన ఆంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు వేములలో విలేకరులతో మాట్లాడారు. దువ్వూరు సొసైటీలో టీడీపీ నీచ రాజకీయాలకు తెర తీసిందని దుయ్యబట్టారు. పదవీ వ్యామోహంతోనే ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డిని పదవి నుంచి తప్పించేందుకు అక్కడి డెరైక్టర్లను టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు. జిల్లాలోని రైతులందరికీ దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ రుణాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. సహకార సొసైటీలను అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని చెప్పారు. అందరినీ కలుపుకు వెళుతూ కేంద్ర సహకార బ్యాంకు అభివృద్ధికి పాటుపడతానన్నారు. వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటా.. తన ఎదుగుదలకు కారణమైన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని నారుబోయిన అంజనేయులు కృతజ్ఞతలుతెలిపారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, వేముల మండల కన్వీనర్ నాగెళ్ల సత్య ప్రభావతమ్మ, పార్టీ నేత వైఎస్ భాస్కర్‌రెడ్డి, ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు ఈసీ గంగిరెడ్డి, నాగెల సాంబశివారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న నారుబోయిన ఆంజనేయులును.. డీసీసీ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాలని శుక్రవారం డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు వేములకు చేరుకొని ఆర్డర్ కాపీ అందజేశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ వాహనంలో కడపకు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కాగా డీసీసీ బ్యాంకు చైర్మన్‌గా ఉన్న ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి దువ్వూరు సొసైటీలో ఏడుగురు డెరైక్టర్లు గురువారం రాజీనామ చేయడంతో పదవిని కోల్పోయారు. దీంతో వేల్పుల సొసైటీ పరిధిలోని వేముల డెరైక్టర్‌గా గెలుపొంది డీసీసీ బ్యాంకు ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్న ఆంజనేయులుకు ఈ పదవి దక్కింది. వేముల వాసి డీసీసీ బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డెరైక్టర్ నుంచి చైర్మన్ వరకు ఎదిగిన వైనం అదృష్టం అంటే ఇదేనేమో. కలలో కూడా ఊహించకుండానే పదవి ఇంటికి వచ్చింది. వ్యవసాయం చేసుకొనే ఆంజనేయులకు అనుకోని రీతిలో అదృష్టం వరించింది. 2013లో వేల్పుల సహకార సొసైటీ పరిధిలో వేముల నుంచి పోటీ చేసి డెరైక్టర్‌గా గెలుపొందారు. అప్పట్లో పులివెందుల ప్రాంతానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఆంజనేయులకు డీసీసీబీ వైస్ చైర్మన్ పదవిని అప్పజెప్పారు.వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆంజనేయులు తనకున్న పొలంలో పంటలు పండించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆంజనేయులుకు ఇద్దరు సంతానం. ఒకరు వేముల, మరొకరు వేంపల్లెలోని ప్రైవేటు పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఊహించని పరిణామాల మధ్య ఆంజనేయులకు పదవి రావడంతో కుటుంబ సభ్యులు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు. -
డీసీసీబీ కేసు సీఐడీకి
పార్వతీపురం : డీసీసీ బ్యాంక్‌లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో పురోగతి కనిపిస్తోంది. తాజాగా సోమవారం ఈ కేసును దర్యాప్తు చేయడానికి సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని డీసీసీబీ, పీఏసీఎస్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో డీసీసీ బ్యాంక్ కు సంబంధించి రూ. 9 కోట్ల కుంభకోణం జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
శివమొగ్గ డీసీసీ బ్యాంకులో లూటీ యత్నం
పోలీసులను చూసి పారిపోయిన ఆగంతకులు శివమొగ్గ : స్థానిక శంకరమఠం బీహెచ్ రోడ్డులో ఉన్న డీసీసీ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి కొందరు ఆగంతకులు చొరబడి లూటీకి విఫలయత్నం చేశారు. పోలీసుల సమాచారం మేరకు... రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఇద్దరు పోలీసులు గస్తీ తిరుగుతూ బ్యాంక్ సమీపంలోకి చేరుకున్నారు. ఆ సమయంలో వారిని గమనించిన కొందరు ఆగంతకులు డీసీసీ బ్యాంక్ షట్టర్‌ను తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకుని పారిపోయారు. విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు కానిస్టేబులుళ్లు చేరవేయడంతో ఇన్స్పెక్టర్ దీపక్, సబ్ఇన్స్పెక్టర్ చెన్పప్ప ఇతర సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. దుండగులు అక్కడే వదిలేసిన గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దుండగులకు పట్టుకునేందుకు కానిస్టేబుళ్లు వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కౌశలేంద్రకుమార్ మాట్లాడుతూ.. బ్యాంక్ దోపిడీకి ముందు నుంచి కాకుండా బ్యాంక్ వెనుక ఉన్న పెన్షన్ మొహల్లా మార్గంలో వచ్చి సమీపంలో ఉన్న భవనం మీదుగా చేరుకుని గ్యాస్ కట్టర్ సాయంతో షట్టర్‌ను కట్ చేయబోయారని వివరించారు. ఘటనపై కోటె పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, బ్యాంక్ లాకర్లో రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. -
పీఏసీఎస్‌లలో రూ. 320 కోట్ల రుణాలు మాఫీ
దేవరకద్ర : జిల్లాలో ఉన్న 77 సహకార బ్యాంకుల్లో 320 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయని డీసీసీ బ్యాంకు డీఎం వెంకటస్వామి తెలిపారు. దీనివల్ల 1.72లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని చెప్పారు. గురువారం ఆయన దేవరకద్రలోని సహకారబ్యాంకును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 మార్చి 31 వరకు పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలకు సంబంధించిన జాబితాలను రూపాందించి గ్రామాల వారిగా అందజేశామన్నారు. ఎక్కడైనా పొరబాట్లు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కుటుంబాల వారీగా రుణమాఫీకి అర్హులను గుర్తిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని బ్రాంచిలను ఆన్లైన్ చేశామని, లావాదేవీలు దేశ వ్యాప్తంగా జరుపుకోడానికి అవకాశం ఉందని తెలిపారు. త్వరలో ఏటీంలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. అనంతరం ఆయన బ్యాంకు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. -
ఖరీఫ్‌లో రూ.520కోట్ల వ్యవసాయ రుణాలు
మధిర, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సీజన్లో రూ. 520 కోట్ల వ్యవసాయ రుణాలు అందించేందుకు లక్ష్యంగా నిర్దేశించినట్లు డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు తెలిపారు. శుక్రవారం స్థానిక డీసీసీ బ్యాంకులో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది రైతులకు రూ. 420 కోట్ల రుణాలు ఇచ్చామని, మరో వందకోట్లు కలిపి ఈ ఖరీఫ్‌లో లక్షా 42వేల మంది రైతులకు రుణాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రూ. 400 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చామని, మరో రూ. 120 కోట్లు ఇవాల్సి ఉందన్నారు. ఈ ఏడాది రూ. 100 కోట్ల వాణిజ్య రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆరు ఎకరాలు ఉన్న రైతు ట్రాక్టర్ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే, రూ. 6లక్షల రుణం మంజూరుచేస్తామన్నారు. పొలానికి సంబంధించి టైటిల్ డీడ్, పాస్‌బుక్ విధిగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలో రూ. 56 లక్షలతో రైతు సంక్షేమ నిధిని ఏర్పాటుచేశామన్నారు. విపత్తులు, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఈ సంక్షేమ నిధి నుంచి రూ. 50 వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఈ ఏడాది 60 సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 33 సహకారం సంఘాల భవనాలను ఆధునికీకరణ చేస్తున్నామని, అందులో భాగంగా మధిర భ్యాంకకు రూ. 10 లక్షలు కేటాయించామన్నారు. రైతులకు జీఓ బ్యాలెన్స్ అకౌండ్తో ఖాతాలు తెరచి, ఆరునెలల్లో ఏటీఎం కారుడలు అందజేస్తామన్నారు. అనంతరం ఖమ్మంపాడు సొసైటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డెరైక్టర్ బోజెడ్ల అప్పారావు, మధిర, దెందుకూరు సొసైటీ చైర్మన్లు బిక్కి కృష్ణప్రసాద్, మాదాల శరత్, ఖమ్మంపాడు చిలుకూరు, ఇల్లూరు గ్రామాల సర్పంచ్‌లు మువ్వా వెంకయ్యబాబు, నిడమానూరు జయమ్మ, కోట సుధారాణి, బ్యాంకు మేనేజర్ దిరిశాల ఆనందరావు, సూపర్వైజర్ మేదరమెట్ల నాగేశ్వరరావు, సీఈఓలు దొండపాటి వీరభద్రరావు, రామలింగేశ్వరరావు, విప్పా శ్రీనివాసరావు, ఎన్వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.