శివమొగ్గ డీసీసీ బ్యాంకులో లూటీ యత్నం
పోలీసులను చూసి పారిపోయిన ఆగంతకులు
శివమొగ్గ : స్థానిక శంకరమఠం బీహెచ్ రోడ్డులో ఉన్న డీసీసీ బ్యాంక్‌లో ఆదివారం రాత్రి కొందరు ఆగంతకులు చొరబడి లూటీకి విఫలయత్నం చేశారు. పోలీసుల సమాచారం మేరకు... రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఇద్దరు పోలీసులు గస్తీ తిరుగుతూ బ్యాంక్ సమీపంలోకి చేరుకున్నారు. ఆ సమయంలో వారిని గమనించిన కొందరు ఆగంతకులు డీసీసీ బ్యాంక్ షట్టర్‌ను తొలగించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకుని పారిపోయారు. విషయాన్ని వెంటనే ఉన్నతాధికారులకు కానిస్టేబులుళ్లు చేరవేయడంతో ఇన్‌స్పెక్టర్ దీపక్, సబ్‌ఇన్‌స్పెక్టర్ చెన్పప్ప ఇతర సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. దుండగులు అక్కడే వదిలేసిన గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
దుండగులకు పట్టుకునేందుకు కానిస్టేబుళ్లు వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కౌశలేంద్రకుమార్ మాట్లాడుతూ.. బ్యాంక్ దోపిడీకి ముందు నుంచి కాకుండా బ్యాంక్ వెనుక ఉన్న పెన్షన్ మొహల్లా మార్గంలో వచ్చి సమీపంలో ఉన్న భవనం మీదుగా చేరుకుని గ్యాస్ కట్టర్ సాయంతో షట్టర్‌ను కట్ చేయబోయారని వివరించారు. ఘటనపై కోటె పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, బ్యాంక్ లాకర్‌లో రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం.