
మూడో రోజూ కరుణించని సీఎం!
రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయినా వికలాంగ పింఛన్‌కు నోచుకోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వికలాంగుడు నారాయణ ముఖ్యమంత్రికి తన గోడు వెల్లబోసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాడు. మూడు చక్రాల సైకిల్‌పై ఇక్కడకు చేరుకున్న అతను శుక్రవారం రాత్రి సీఎం ఇంటి ఎదురుగా నిద్రించాడు. సీఎంను కలవడానికి శనివారం విఫలయత్నం చేశాడు. ఆదివారం సాయంత్రం వరకు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద నిరీక్షించినా ఫలితం లేకపోయింది.
సోమవారం ఉదయం సచివాలయానికి వస్తారని పోలీసులు చెప్పడంతో రాత్రికి రాత్రి ట్రైసైకిల్‌పై వెలగపూడి సచివాలయానికి చేరుకున్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా అని అక్కడే నిరీక్షిస్తున్నాడు. సోమవారమైనా నారాయణకు సీఎంను కలిసే అవకాశం దొరుకుతుందో లేదో పాపం. ఇంతకీ ఇతని సమస్య ఏమిటంటే వికలాంగ పింఛన్, కిరాణా కొట్టు పెట్టుకోవడానికి రుణం. – తుళ్లూరు