పాలకొల్లు : పాలకొల్లు పట్టణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పుష్కర పనులకు అప్పుడే తూట్లు పడుతున్నాయి. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో ఈ దుస్థితి దాపురించింది.
పాలకొల్లు : పాలకొల్లు పట్టణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పుష్కర పనులకు అప్పుడే తూట్లు పడుతున్నాయి. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో ఈ దుస్థితి దాపురించింది. పాలకొల్లులో బ్రాడీపేట మీదుగా నిర్మించిన బైపాస్ రోడ్డు అధికారుల తీరును వెక్కిరిస్తోంది. పుష్కరాల నేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గంలో రూ.70 కోట్ల వ్యయంతో పంచాయతీరాజ్, మునిసిపల్, ఆర్ అండ్ బీ, విద్యుత్, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో వివిధ పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే బ్రాడీపేటలోని ఒకటిన్నర కిలోమీటర్ల బైపాస్ రోడ్డును వెడల్పుచేసి, సెంట్రల్ డివైడర్ నిర్మించారు. ఇందుకోసం రూ.2.50 కోట్లు వెచ్చించారు.
దీనిని ఈనెల 10న రవాణా, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అట్టహాసంగా ప్రారంభించారు. మూడు రోజులు గడవకుండానే ఆ రోడ్డు దిగబడిపోయింది. శుక్రవారం ఆ రహదారి మీదుగా బియ్యం లోడుతో వెళుతున్న లారీ వెనుక చక్రాలు రోడ్డుపై దిగబడిపోయాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో రహదారులను అధ్వానంగా తయారు చేశారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక రోడ్లను పటిష్టంగా నిర్మిస్తున్నామని ఈ రహదారిని ప్రారంభించిన సందర్భంలో మంత్రి శిద్ధా రాఘవరావు గొప్పగా చెప్పారు. ఆయన మాట్లాడి వెళ్లిన కొద్దిగంటల్లోనే దిగబడిన రహదారి ఈ పనుల్లో డొల్లతనాన్ని బయటపెట్టింది.
క్వాలిటీ కంట్రోల్ దృష్టి సారించాలి
బైపాస్ రోడ్డులో లారీ దిగబడిన ప్రాంతాన్ని పరిశీలించిన పాలకొల్లు మునిసిపల్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ నాయకుడు యడ్ల తాతాజీ విలేకరులతో మాట్లాడుతూ.. తూతూమంత్రంగా పనులు చేయడం వల్లే రోడ్డు దిగబడిపోయే దుస్థితి దాపురించిందన్నారు. పాలకొల్లు పట్టణంలో చేపట్టిన పుష్కర పనుల్లో నాణ్యత కొరవడిందని ఎప్పటినుంచో చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడి పనులపై క్వాలిటీ కంట్రోల్ విభాగం ప్రత్యేక దృష్టి సారించాలని, పనులు నాణ్యతగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.