పార్మసీ విద్యార్థి శ్రావణ్ కుమార్పై ర్యాగింగ్ చేసిన కేసులో ముగ్గురు సీనియర్ విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రొబిహెషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అండ్ ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కథనం ప్రకారం... నగర శివారులోని దిండిగల్లోని ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లో కొత్తగా శ్రావణ్ కుమార్ పార్మసీ కోర్సులో చేరాడు. అయితే అదే కాళాశాలలో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సీనియర్ విద్యార్థులు సురేష్ బాబు, ఎం బాను ప్రకాశ్, ఎం హేమంత్లు ర్యాగింగ్ చేశారు. అ క్రమంలో శ్రావణ్ వారికి ఎదురు తిరిగాడు. దాంతో సీనియర్ విద్యార్థులు శ్రావణ్పై దాడి చేశారు.
దాంతో శ్రావణ్ తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యకు యత్నించాడు. ఆ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు శ్రావణ్ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే శ్రావణ్ ఆత్మహత్యకు యత్నించాడన్న విషయం తెలుసుకున్న సీనియర్ విద్యార్థులు పరారయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.