వరుసగా ముగ్గురు విద్యార్థులు..వారిలో ఒకరి వద్దే ప్రశ్నపత్రం.. దానినే మిగిలిన విద్యార్థులు పంచుకోవడం..ఇదీ ప్రభుత్వ ఐటీఐలో బుధవారం
బొబ్బిలి: వరుసగా ముగ్గురు విద్యార్థులు..వారిలో ఒకరి వద్దే ప్రశ్నపత్రం.. దానినే మిగిలిన విద్యార్థులు పంచుకోవడం..ఇదీ ప్రభుత్వ ఐటీఐలో బుధవారం కనిపించిన దృశ్యం.. సాంకేతిక విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థికీ ప్రశ్నపత్రం అందని పరిస్థితి ఏర్పడింది. బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో రెండో సంవ త్సరం విద్యార్థులకు బుధవారం నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి.. ఈ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాన్ని ఆన్‌లైన్‌లో ఆ శాఖ ప్రతిరోజూ పంపుతుంది. బుధవారం ఆన్‌లైన్ కష్టాల వల్ల మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం రాలేదు. ఆ తరువాత వచ్చాక సరిపడినన్ని జిరాక్స్‌లు తీయకపోవడంతో ఉన్నవే విద్యార్థులకు సర్దారు. దాంతో ఒక పేపరును ముగ్గురు విద్యార్థులు పంచుకోవాల్సి వచ్చింది. అలాగే ఈ పరీక్షల్లో కూడా మాస్ కాపీయింగ్‌కు విద్యార్థులు సిద్ధమయ్యారు. ఒకరు రాసుకున్న తరువాత మరొకరికి ఇచ్చే విధంగా విద్యార్థులు ప్లాన్‌లు వేసుకున్నారు.. ప్రశ్నపత్రాలు చేతిలో ఉన్నా జవాబు పత్రాలపై పెన్ను కదలకుండా చూచిరాతకు సిద్ధమయ్యారు. అలాగే పరీక్షా కేంద్రంలో కూడా విద్యార్థులను నేలపైనే అత్యంత సమీపంగా కూర్చోబెట్టి నిర్వాహకులు కూడా విద్యార్థులకు సహకరించారు.
ఆఖరి నిమిషంలో పరీక్షకు ప్రైవేటు విద్యార్థులు
బొబ్బిలి శ్రీనివాస ప్రైవేటు ఐటీఐ విద్యార్థులు ఆఖరి నిమిషంలో ప్రభుత్వం ఐటీఐలో ప్రాక్టికల్స్ చేయడానికి వచ్చారు. రాతపూర్వకంగా ఆదేశాలను ఆ శాఖ ఇవ్వకపోగా మౌళిక ఆదేశాలను జారీ చేసి వారికి ప్రాక్టికల్స్ జరపాలని సూచించారు. బుధవారం దాదాపు 250 మంది వరకూ అన్ని ట్రేడుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. వీటి పర్యవేక్షణకు విశాఖ ఎన్‌ఎస్‌టీఎల్ ప్రిన్సిపాల్ బి అప్పారావు, గ్రోత్‌సెంటరు ఏఈ గోపీనాయుడు, విశాఖ స్టీల్‌ప్లాంటు సీనియర్ ఏజీఎం శ్రీనివాసరావు, స్వామి పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ దివ్య, స్థానిక ప్రిన్సిపాల్ ప్రకాశంలు పర్యవేక్షించారు.