వేముల/పులివెందుల: వైఎస్సార్ జిల్లాలో శుక్రవారం రాత్రి గాలివాన సృష్టించిన బీభత్సానికి అరటి తోటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడులు చేతికందే సమయంలో ప్రకృతి ప్రకోపించడంతో కోతకు వచ్చిన అరటి గెలలు నేలవాలాయి. నిమ్మ తోటలు కూడా దెబ్బతినడంతోఅన్నదాతలు లబోదిబోమంటున్నారు. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలో 285 హెక్టార్లలో అరటి, 5 ఎకరాల్లో నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి.
అరటి రైతులకు రూ.10 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. అలాగే వేంపల్లె మండలంలో 160 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతినగా రూ.1.80 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గాలివానతో రాత్రికి రాత్రే తన నాలుగెకరాల్లో సాగు చేసిన అరటి దెబ్బతిని రూ.8 కోట్లు నష్టపోయానని వి.కొత్తపల్లెకు చెందిన మల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేయగా, రెండెకరాల్లోని అరటి తోటను గాలివాన దెబ్బతీసిందని అదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఆందోళన వ్యక్తం చేశారు.
ఎకరాకు రూ.35 వేలు ఇవ్వాలి: వైఎస్ అవినాష్‌రెడ్డి
గాలివాన బీభత్సంతో నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.35 వేల నష్టపరిహారం ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె, వి.కొత్తపల్లెలలో గాలివానతో నేలవాలిన అరటి తోటలను పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యానశాఖ అధికారులను అప్రమత్తం చేసి, పంటనష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు.
నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వం అరటి మొక్కలను ఉచితంగా ఇవ్వాలన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో వెదర్ స్టేషన్లు ఉండటంతో వాతావరణాన్ని అంచనా వేయొచ్చని, మిగిలిన ప్రాంతాల్లో వెదర్ స్టేషన్లు లేవని తెలిపారు. వాతావరణం ఆధారంగా కాకుండా వాస్తవంగా క్షేత్రస్థాయిలో నష్టాలను అంచనా వేసి రైతులకు పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గత 15 ఏళ్లుగా రైతులు అరటిని సాగు చేస్తున్నారని.. ప్రతి ఎకరాకు రూ.3 వేల ప్రీమియం చెల్లిస్తున్నా ఇన్సూరెన్స్ వచ్చిన దాఖలాల్లేవన్నారు.
ఇన్సూరెన్స్ విధానంలో లోపాలున్నాయని.. ఈ విషయంపై పార్లమెంటులో కూడా తాను ప్రస్తావించామని, లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వేముల మండలంలో నష్టపోయిన అరటి రైతుల విషయాన్ని వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశ్వరరెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేసి, రైతులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు. పంట నష్టం వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని బాధిత రైతులకు ఎంపీ అవినాష్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment