వజ్రపాత్ యాప్
సాక్షి, వల్లూరు: ప్రస్తుతం వర్షా కాలం. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుని భారీ శబ్దాలతో ఉరుములు, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతితో మెరుపులు కనిపిస్తున్నాయంటే.. దగ్గర్లో ఎక్కడో ఓ చోట పిడుగు పడే అవకాశం ఉందని భావిస్తాం. పిడుగు పడటం ప్రస్తుత కాలంలో సర్వ సాధారణంగా మారింది. ఎన్నో మూగజీవాలతోపాటు ఎందరో మనుషులు బలై ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పొలాలు, చెట్ల కింద వున్న ఉన్న వారే ఎక్కువగా గురవుతున్నట్లు గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెలుస్తోంది. పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక వేళ పిడుగు పాటుకు గురైతే వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రథమ చికిత్స ఎలా అందించాలి, సమాచారం ముందస్తుగా తెలుసుకోవడం మొదలైన అంశాలపై నిపుణుల సూచనలు, సలహాలు ఇలా ఉన్నాయి. వీటిని పాటించి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించుకోవడానికి ప్రయత్నిద్దాం. పిడుగు పడే సమయంలో వచ్చే మెరుపులో ఎంతో తీవ్రమైన శక్తి దాగి ఉంటుంది. అది తాకిన మరుక్షణం జీవి ఏదైనా ప్రాణాన్ని కోల్పోవడం జరుగుతుంది. పిడుగు దాదాపుగా ఎత్తైన చెట్లు, భవనాలు, ప్రదేశాలు, వస్తువులపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎత్తు తక్కువ ఉన్న చోట కాస్త సురక్షితం. పచ్చని చెట్లను తాకే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. కాబట్టి ఆ సమయంలో చెట్ల కింద ఉండరాదు.
ఆరుబయట ఉంటే..
ఆరుబయట ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు సురక్షిత భవనాల్లోకి వెళ్లడానికి ప్రయత్నించాలి. పొలంలో పూర్తి ఆరుబయట ఉంటే మొక్కల కన్నా మనిషి ఎక్కువ ఎత్తు ఉంటాడు.. కాబట్టి పిడుగు అతనిపై పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిడుగు పడేటపుడు అర చేతులతో చెవులను మూసుకుని తల వంచుకుని నేలపై మోకాళ్ల మీద కూర్చోవాలి.
ఇంట్లో ఉంటే..
మొబైల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యుత్‌కు అనుసంధానం చేయరాదు. విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకుండా ఉండటం మంచిది.
పిడుగుపాటుకు గురైతే ..
పిడుగుపాటుకు గురైతే అంబులెన్స్, వైద్యులకు సమాచారం అందించాలి. బాధితుడికి ప్రథమ చికిత్స అందించాలి. పిడుగు తాకిన ప్రదేశం తడిగా ఉంటే.. దుప్పటి లాంటి వస్త్రంపై పడుకోబెట్టాలి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
యాప్ డౌన్ లోడ్ ..
గూగుల్ ప్లే స్టోర్‌లో ‘వీఏజేఆర్‌ఏపీఏఏటీ ’ అని టైప్ చేసి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జియో ట్యాగింగ్ కోసం మొబైల్‌ఫోన్ నంబర్‌ను అడుగుతుంది. నంబర్‌ను ఎంటర్ చేసి భాష ఎంచుకోవాలి. యాప్ ముఖ చిత్రం కనిపిస్తుంది. లొకేషన్ సెట్ చేసుకుంటే.. మీరు ఉండే ప్రదేశంలో పిడుగు పడే అవకాశాలపై తగిన సమాచారం, సూచనలు అందిస్తుంది. యాప్ రెండు రకాల సమాచారాన్ని ఇస్తుంది. ఎడమ చేతి వైపు పిడుగు గుర్తుతో వున్న చోట క్లిక్ చేస్తే మీరున్న ప్రాంతం మ్యాప్ వస్తుంది. మ్యాప్‌లో ఎరుపు, నారింజ, పసుపు రంగుల్లో వలయాలు కనిపిస్తాయి. వలయాల పక్కన అంకెలు ఉంటాయి. ఆ అంకెల ప్రకారం పిడుగు పడే అవకాశాలను చూపిస్తుంది. పిడుగు ఎంత దూరంలో పడుతుందో.. పిన్ గుర్తు ద్వారా స్పష్టత ఇస్తుంది. యాప్ కుడి భాగంలో పిడుగు పాటు హెచ్చరికలు తెలిపే బటన్ ఉంటుంది. యాప్ ఆన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు.
వజ్రపాత్‌తో ముందస్తు సమాచారం
పిడుగుపాటు వల్ల ఎదురయ్యే విపత్తును నివారించడానికి విపత్తుల నివారణ సంస్థ ఆధనిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పిడుగు పాటుకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తిస్తుంది. 30 నిమిషాల ముందుగా అధికారుల ద్వారా ఆ ప్రాంత సెల్‌ఫోన్‌లకు అలర్ట్ మెసేజ్‌లను అందిస్తుంది. దీనికి తోడు ఇటీవల ఇస్రో సహకారంతో పిడుగు పాటు గురించి ముందస్తు సమాచారం తెలుసుకోడానికి.. వజ్రపాత్ అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌తో పిడుగు ఎక్కడ పడుతుందో ముందే తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఉంటే చాలు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. పిడుగులకు సంబంధించిన సమాచారాన్ని ఇట్లే తెలుసుకోవచ్చు.
రంగులను బట్టి.. తీవ్రత
► మెరుపు చిహ్నం, శీర్షిక నీలం రంగులో వుంటే మీరు పిడుగు పడే స్థలానికి దూరంగా వున్నట్లు అర్థం.
► మెరుపు చిహ్నం, శీర్షిక పసుపు రంగులో వుంటే మీరు పిడుగు పడే ప్రాంతానికి 15 నుంచి 30 కిలోమీటర్ల సమీపంలో ఉన్నట్లు లెక్క.
► మెరుపు చిహ్నం, శీర్షిక నారింజ రంగులో వుంటే మీరు పిడుగు పడే ప్రాంతానికి 8 నుంచి 15 కిలోమీటర్ల సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.
► మెరుపు చిహ్నం, శీర్షిక ఎరుపు రంగులో ఉంటే మీరు పిడుగు పడే ప్రాంతానికి 0 నుంచి 8 కిలోమీటర్ల సమీపంలో వున్నట్లు.. అంటే అత్యంత ప్రమాదరకరమైన స్థలమని అర్థం.
Comments
Please login to add a commentAdd a comment