చిన ఓగిరాల (ఉయ్యూరు) : కరెంటు తీగే కౌలురైతు పాలిట యమపాశమైంది. చెరకు తోట ఎలా ఉందో చూడ్డానికి పొలానికి వెళ్లిన ఆ రైతు పంట పొలంలోనే మృత్యువుతో పోరాడి విగతజీవుడయ్యారు. మండలంలోని చిన ఓగిరాల గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కౌలు రైతు మైనేని మల్లిఖార్జునరావు (41) ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తాను సాగు చేస్తున్న చెరకు తోటను చేసేందుకు బైక్‌పై పొలానికి వెళ్లారు. పిలకతోట మధ్యలో నడుచుకుంటూ వెళుతుండగా అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్ తీగ కాలుకు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంటి నుంచి వెళ్లిన మల్లిఖార్జునరావు మధ్యాహ్నమవుతున్నా రాకపోయేసరికి కుటుంబసభ్యుల్లో ఆందోళన పెరిగింది.
వ్యవసాయంతో పాటు మల్లిఖార్జునరావు క్యాటరింగ్ మేస్త్రిగా కూడా పనిచేస్తారు. రైతులు, కుటుంబ సభ్యులు, క్యాటరింగ్ వర్కర్లు మల్లిఖార్జునరావు సెల్‌ఫోన్ మోగుతున్నా తీయకపోయేసరికి ఆరా తీసి పొలం వైపు వెళ్లారు. రోడ్డుపక్కన బైక్ పెట్టి ఉండటంతో అందరూ పొలంలోకి వెళ్లి చూసేసరికి ఆయన మృతదేహం కనిపించింది. విద్యుత్ వైరు కాలుకు చుట్టుకుని ఉండటాన్ని గమనించి.. సమాచారాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో వారు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విషయం తెలుసుకున్న పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, విద్యుత్ శాఖ ఏడీఈ గోవిందరాజులు, చిన ఓగిరాల సహకార సంఘం అధ్యక్షుడు వెనిగళ్ల కుటుంబరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి బంధువులను పరామర్శించారు.
విద్యుత్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
విద్యుత్ మరణాల నేపథ్యంలో ఆ శాఖ అధికారులపై పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లిఖార్జునరావు కుటుంబానికి విద్యుత్ శాఖ నుంచి న్యాయం చేయాలని ఏడీఈ గోవిందరాజులును ఆయన ఆదేశించారు. తన నియోజకవర్గంలో ఎందుకు ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. పంట పొలాల్లో వేలాడే విద్యుత్ వైర్లను సరిచేయాలని సూచించారు. విద్యుత్ ప్రమాద ఘటన సమాచారం మరోసారి వింటే సహించేది లేదని హెచ్చరించారు.
కరెంటు తీగే యమపాశమైంది
Published Mon, Mar 23 2015 1:38 AM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM
Advertisement