
అమరావతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరగబోయే పోలింగ్ బూత్‌ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తోన్నట్లు డీఐజీ కాంతి రాణా టాటా తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద అలజడులు సృష్టించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. రీపోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పహారా కాస్తున్నట్లు చెప్పారు.
ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద సుమారు 350 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానికేతరులు వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రౌడీషీటర్లను ఇప్పటికే బైండోవర్ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు ఐదు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని పేర్కొన్నారు.