విభజన ప్రక్రియకు టైం టేబుల్ రెడీ
-
60 రోజుల్లో పూర్తి టైం టేబుల్ రెడీ
-
విభజనతో సంబంధం లేని పదోన్నతులూ నిలిపివేత
-
సర్వీసు అంశాల్లో సలహా ఫైళ్లు ఆయా శాఖలకు తిరుగు టపా
-
ముగ్గురు ఐఏఎస్‌లతో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం పటిష్టం
-
{పస్తుతం ఉన్న సెక్షన్‌కు అదనంగా మరో రెండు సెక్షన్లు, సిబ్బంది
-
సచివాలయంలో ఫైళ్ల జిరాక్స్‌కోసం అద్దెకు జిరాక్స్ యంత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ తరహాలోనే రాష్ట్ర విభజన ప్రకియ పూర్తి చేయడానికి 60 రోజుల సమయాన్ని నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అన్ని శాఖలకు టైంటేబుల్‌ను పంపించారు. ఏ శాఖ ఏ తేదీలోగా విభజనకు సంబంధించి ఏ పనిని పూర్తి చేయాలో అందులో వివరించారు. ఈ నెల 15వ తేదీలోగా ఫైళ్ల విభజన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రికార్డు రూమ్స్‌లో ఫైళ్లను కూడా ప్రాంతాల వారీగా విభజించాలని స్పష్టం చేశారు. ఆ తరువాత ఆ ఫైళ్లను జిరాక్స్ తీయాలని, ఒక్కో ఫైలును మూడు సెట్లు చొప్పున జిరాక్స్ తీయాలని స్పష్టం చేశారు.
సచివాలయంలో మెజారిటీ శాఖల్లో జిరాక్స్ మిషన్లు పది లేదా పదిహేను కాగితాలను జిరాక్స్ తీసే సామర్థ్యమే ఉంది. రెవెన్యూ, పంచాయతీరాజ్, సాగునీటి, సాధారణ పరిపాలన, రహదారులు-భవనాలు వంటి శాఖల్లో లక్షల సంఖ్యలో ఫైళ్లు, కోట్ల సంఖ్యలో కాగితాలను జిరాక్స్ తీయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయంలోని అన్ని భవనాల్లో అంతస్తుకు ఒకటి చొప్పున జిరాక్స్ యంత్రాలను అద్దెకు తీసుకువచ్చి అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
విభజన ప్రక్రియకు స్పష్టమైన టైంటేబుల్‌ను సీఎస్ నిర్ణయించడంతో సాధారణంగా జరగాల్సిన పనులను అన్ని శాఖలు నిలుపుదల చేశాయి. కేవలం విభజన పనిని మాత్రమే చేస్తున్నారు.
రాష్ట్ర విభజనతో సంబంధం లేని, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లోని ఉద్యోగులకు పదోన్నతులను కూడా సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిన్హా నిలుపుదల చేశారు. దీంతో త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులతో పాటు వాస్తవంగా పదోన్నతి లభించాల్సిన సమయంలో పదోన్నతి రాకపోవడంతో సర్వీసుపై ప్రభావం పడుతుందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు తప్ప మిగతా పోస్టుల్లోని వారికి పదోన్నతి ఇవ్వచ్చని పలువురు ఐఏఎస్‌లు పేర్కొన్నా సిన్హా ససేమిరా అన్నారు. దీంతో విభజనతో సంబంధం లేకపోయినా ఆ కారణంగా తమ సర్వీసుకు భంగం కలిగేలా వ్యవహరించడం పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఉద్యోగుల సర్వీసు అంశాలకు సంబంధించి పలు శాఖలు సలహా కోసం పంపించిన అన్ని ఫైళ్లను ఎటువంటి సలహాను ఇవ్వకుండా సిన్హా ఆయా శాఖలకు తిరుగు టపాలో పంపించాలని నిర్ణయించారు. దీనిపై కూడా పలు శాఖల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన అంశాలను వేగవంతం చేయడానికి వీలుగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాన్ని పటిష్టం చేశారు. ఈ విభాగంలో తెలంగాణకు, సీమాంధ్రకు చెందిన ఐఏఎస్‌లైన రామకృష్ణారావు, బి.వెంకటేశంతో పాటు ఇతర రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి జయేశ్‌రంజన్‌ను నియమించారు. అలాగే ప్రస్తుతం ఈ విభాగంలో ఒక సెక్షన్ మాత్రమే ఉండగా అదనంగా మరో రెండు సెక్షన్లను, సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.