పల్స్ పోలియోను విజయవంతం చేయండి | To the success of Pulse Polio | Sakshi
Sakshi News home page

పల్స్ పోలియోను విజయవంతం చేయండి

Published Sat, Jan 18 2014 2:44 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

To the success of Pulse Polio

అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ :  జిల్లాలో ఈ నెల 19 నుంచి మూడు విడతల్లో నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి(డీఎంఅండ్‌హెచ్‌ఓ) రామసుబ్బారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 5.80 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
 
 శుక్రవారం ఆయన డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్ల నుంచి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా పోలియో తగ్గుముఖం పట్టిందన్నారు.

   దేశంలో 2007లో 877, 2008లో 559 కేసులు నమోదయ్యాయన్నారు. ఆ తర్వాత 2011లో ఒక కేసు మాత్రమే నమోదైనట్లు వివరించారు. జిల్లాలో  2003లో 8 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆ తర్వాత ఒక్క కేసు కూడా రాలేదన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ప్రతియేటా పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పుట్టినబిడ్డ   నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలన్నారు. ఈసారి జిల్లాలో వంద శాతం పిల్లలకు పోలియోచుక్కలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 3849 బూత్‌లతో పాటు 115 మొబైల్, 18 రాపిడ్ యాక్షన్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. వలస వెళ్లేవారు, యాచకులు, కార్మికులు, మురికివాడలలో నివసించే వారి పిల్లలకు చుక్కలు వేయించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లలో కూడా పోలియో బూత్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.సమావేశంలో వైద్యాధికారులు సాయిప్రతాప్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement