
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి అపర సంజీవని అయిన ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర ప్రజలు మరోసారి బంద్‌కు సిద్ధమయ్యారు. ‘హోదా’ కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్న ప్రజలు మరోసారి బంద్‌తో తమ ఆకాంక్షను ఎలుగెత్తి చాటనున్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కకపోవడంతో ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసన తెలపడానికి సంసిద్ధమయ్యారు. హోదా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర బంద్ చేపట్టనున్నారు.
ఈ బంద్‌కు టీడీపీ, బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలపడమే కాకుండా తాను నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సైతం సోమవారం విరామం ప్రకటించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు బంద్‌ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. మరోవైపు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ సహా అన్ని పక్షాలు బంద్ విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చాయి.
ప్రజాసంఘాలు, ఉద్యోగ, స్వచ్ఛంద సంఘాలు సైతం ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి. అయితే బంద్‌కు తమ పార్టీ దూరంగా ఉంటుందని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు బంద్ విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. నిరసనల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ నోటీసుల ద్వారా విపక్షాల నేతలు, కార్యకర్తలను బెదిరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ప్రభుత్వ ఆంక్షలను సైతం లెక్కచేయక పార్టీలు, ప్రజలు బంద్‌కు సర్వసన్నద్ధమయ్యారు. ప్రత్యేకక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం సోమవారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.