ఏజెన్సీకి ‘ఎయిడ్స్’ వణుకు | Today is World AIDS Day | Sakshi
Sakshi News home page

ఏజెన్సీకి ‘ఎయిడ్స్’ వణుకు

Published Sun, Dec 1 2013 3:58 AM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM

ఎయిడ్స్ నివారణకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుంది. వ్యాధి పీడుతుల ఆయుష్షు పెంచే అధునాతన మందులు అందుబాటులోకి వచ్చినా వాటిని సకాలంలో వారి దరికి చేర్చలేకపోతుంది.

భద్రాచలం, న్యూస్‌లైన్:  ఎయిడ్స్ నివారణకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుంది. వ్యాధి పీడుతుల ఆయుష్షు పెంచే అధునాతన మందులు అందుబాటులోకి వచ్చినా వాటిని సకాలంలో వారి దరికి చేర్చలేకపోతుంది. భద్రాచలం ఏజెన్సీ ఆస్పత్రుల్లో రక్త పరీక్షలు చేయించుకున్న ప్రతి వందమందిలో ఐదుగురు హెచ్‌ఐవీ పీడితులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం.
 జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిని నియంత్రించేందుకు 2009లో ఎయిడ్స్ నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెచ్‌ఐవీ నిర్దారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాధారణ వ్యాధి గ్రస్తులతో పాటు ఆస్పత్రులకు వైద్య సేవలు నిమిత్తం వచ్చే రోగులకు ఐసీటీసీ కేంద్రాలలో హెచ్‌ఐవీ పరీక్ష నిర్వహిస్తున్నారు. పీపీటీసీటీ కేంద్రాల్లో గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి నివారణ, అవగాహన కల్పించే నిమిత్తం ప్రత్యేకంగా ఏఆర్‌టీ కేంద్రాలను  ఏర్పాటు చేసి తగినంత మంది సిబ్బందిని కూడా నియమించారు. కానీ పరీక్షల్లో నిర్ధారణ అయిన వ్యాధి గ్రస్తులనే తప్ప పల్లెలపై అధికారులు దృష్టి సారించడం లేదు.
  హెచ్‌ఐవీ పరీక్షల నిమిత్తం 2002లో స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఐసీటీసీ కేంద్రాన్ని ప్రారంభించారు. 2013 నవంబర్ 30 వరకు 42,416 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,306 మందికి హెచ్‌ఐవీ సోకినట్లుగా నిర్దారణ అయింది. రెండేళ్లుగా వ్యాధిగ్రస్తుల సంఖ్య పరిశీలించినట్లైతే 2011లో 5,216 మందికి పరీక్షలు నిర్వహించగా 219 మందికి, 2012లో 4,925 మందికి రక్తపరీక్షలు నిర్వహించగా 279 మందికి హెచ్‌ఐవీ సోకినట్లుగా తేలింది. 2013 నవంబర్ 30 వరకు 7,917 మందికి పరీక్షలు నిర్వహించగా 240 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ ఏడాది 8 మంది గర్భిణులకు కూడా హెచ్‌ఐవీ సోకింది.
 పరీక్షలకే పరిమితమవుతున్న కేంద్రాలు
 ఎయిడ్స్ నిర్ధారణకు జిల్లా మొత్తంమీద 67 సమగ్ర హెచ్‌ఐవీ కౌన్సెలింగ్, పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 8 ఐసీటీసీలు, మూడు తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా నివారణ కేంద్రాలు, 49 ఫెసిలిలేటెడ్ సమగ్ర హెచ్‌ఐవీ కౌన్సెలింగ్ పరీక్షా కేంద్రాలున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు వంటి చోట్ల ప్రత్యేక సిబ్బది పనిచేసే 11 కేంద్రాలు సైతం ఉన్నాయి. ఇంత పెద్ద యంత్రాంగం ఉన్నా వ్యాధి నిర్ధారణ తర్వాత హెచ్‌ఐవీ పీడితులకు సరైన కౌన్సెలింగ్ ఇవ్వకపోవడంతో వారు సకాలంలో వైద్యసేవలు పొందలేక మృత్యువుకు చేరువవుతున్నారు.
 పింఛన్ కోసం సవాలక్ష ఆంక్షలు
  ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నెలకు రూ.200 చొప్పున పింఛన్ అందజేస్తుంది. కానీ నాలుగు నెలలుగా పింఛన్ బకాయిలు పెంఢింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలు అందించే భద్రాచలం ఏఆర్‌టీ సెంటర్ పరిధిలో 210 మంది పింఛన్‌దారులు ఉన్నారు. మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఏఆర్‌టీ కేంద్రాల్లో చికిత్సలు పొందినట్లుగా నమోదైతేనే పింఛన్ సక్రమంగా వస్తుంది. అనివార్యకారణాలతో చికిత్సలకు రానివారికి తిరిగి పింఛన్ పునరుద్ధరణకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఏడాది కాలపరిమితితో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు పాసులు ఇస్తున్నారు. ఏజెన్సీ పరిధి వరకు ఇలా 273 పాసు లు ఇవ్వగా రెండో ఏడాది 16 మందికే రెన్యువల్ చేశారు. మిగిలిన వారికి అందించటంలో సదరు అధికారులు శ్రద్ధ చూపటం లేదు.
 పౌష్టికాహార కేంద్రాలు ఎత్తివేత
 వ్యాధిగ్రస్తుల ఆయుష్షు పెంచేందుకు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో)ఆధ్వర్యంలో జిల్లాలోని ఖమ్మం, భద్రాచలంలో పోషకాహార కేంద్రాలను ఏర్పాటు చేశారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర, సత్తుపల్లిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటువంటి కేంద్రాలను నెలకొల్పారు. నిధులు లేక నాకో ఆధ్వర్యంలో ఉన్న కేంద్రాలు మూతపడ్డాయి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను వేరుగా ఉంచి పౌష్టికాహారం అందించటంలో వివక్ష చూపుతున్నారనే విమర్శలు వస్తున్నందునే వాటిని ఎత్తివేసినట్లుగా ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది. ఈ కారణంగానే ఏజెన్సీ పరిధిలో 243 మంది మృత్యువాత పడ్డారు. వీరికి టీబీ వ్యాధి ముదరటం కారణంగానే మృతి చెందారని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement