
సీఎం సభలో లేనందున రేపు చర్చిద్దాం:వైఎస్ జగన్
హైదరాబాద్: హుద్హుద్ తుపానుపై అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే బాగుంటుందని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు శాసనసభలో హుద్హుద్ తుపానుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఇది ప్రధాన సమస్య అయినందున సభలో ముఖ్యమంత్రి ఉంటే బాగుండేదన్నారు.
శాసనసభ తేదీలు ఖరారు చేసింది ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. ప్రధాన సమస్య చర్చించే సమయంలో ముఖ్యమంత్రి సభలో లేకపోవడం బాధితులను కించపరచడమేనన్నారు. ముఖ్యమంత్రి సభలో లేనందున ఈ అంశాన్ని రేపు చర్చిద్దామని జగన్ సూచన చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దామోదరం సంజీవయ్య న్యాయవిశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వెళ్లారని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆ కార్యక్రమం ముగించుకొని సీఎం వస్తారని, అప్పటివరకు చర్చ కొనసాగించాలని ఆయన కోరారు.