రేపు జగన్ రాక | Tomorrow jagan tour in district | Sakshi
Sakshi News home page

రేపు జగన్ రాక

Published Tue, Nov 12 2013 12:57 AM | Last Updated on Tue, Sep 3 2019 8:53 PM

Tomorrow jagan tour in district

సాక్షి, రాజమండ్రి :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. కాకినాడలో జరిగే మాజీ మంత్రి, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ కుమారుని వివాహానికి ఆయన హాజరు కానున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై స్థానిక ఉమా రామలింగేశ్వర కల్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశం జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన సోమవారం జరిగింది.

ముఖ్య అతిథిగా బోస్ మాట్లాడుతూ, 19 నెలల  తర్వాత జిల్లాకు వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘ఇప్పటివరకూ జగన్ జిల్లాకు ఎప్పుడు వచ్చినా అపూర్వ స్వాగతం అందించాం. బుధవారం అంతకన్నా ఘనమైన రీతిలో ఆహ్వానం పలుకుదాం’ అని కార్యకర్తలను ఉత్తేజపరిచారు. చిట్టబ్బాయి మాట్లాడుతూ జగన్ పర్యటన విజయవంతానికి ప్రతి కార్యకర్తా కృషి చేయాలన్నారు. ఎవరు ఏ ఏర్పాట్లు చేయాలో నిర్దేశించారు. పర్యటన రూట్ మ్యాప్‌పై నేతలతో చర్చించారు.
 సమైక్య జెండాలు పట్టండి..
 ‘రాష్ట్రంలో సమైక్య ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న జగన్ వస్తున్న తరుణంలో ప్రతి నేత, కార్యకర్త పార్టీ జెండాకు తోడు సమైక్య జెండాను కూడా తీసుకురావాలి’ అని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పిలుపునిచ్చారు. మరో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ జైలు నుంచి వచ్చాక తొలుత కడప జిల్లా వెళ్లిన జగన్ అనంతరం మన జిల్లాకే వస్తున్నారన్నారు. ‘అధినేతకు మనపై ఉన్న అభిమానానికి తగ్గట్టుగా మనం పలికే స్వాగతం ఉండాలి’ అన్నారు.

పాయకరావుపేట ఎమ్మెల్యే, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు మాట్లాడుతూ, కడప తర్వాత జగన్ జిల్లాకు రావడం వల్ల సెంటిమెంట్‌గా కూడా పార్టీకి లాభం చేకూరుతుందన్నారు. సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో ఓపక్క సమైక్య ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ, జాతీయస్థాయికి ఉద్యమాన్ని నడిపిస్తూ, క్షణం తీరిక లేని సమయంలో కూడా పార్టీ నేతల కుటుంబాలతో మమేకమై, వారింట్లో శుభకార్యాలకు జగన్ హాజరవుతున్న తీరును తాను ఇప్పటివరకూ ఏ నేతలోనూ చూడలేదన్నారు. ఈ పర్యటన పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందన్నారు.
 జనాదరణ కలిగిన నేత జగన్ ఒక్కరే..
  సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జగన్ ఎక్కడ సభ పెట్టినా ఆదరించేందుకు జనం తరలివస్తారన్న విషయం ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమైక్య శంఖారావం సభ ద్వారా నిరూపితమైందన్నారు. అంతటి సత్తా కలిగిన నేత జగన్ మాత్రమేనన్నారు. తన భర్త జక్కంపూడి రామ్మోహనరావు దూరమైనప్పటి నుంచీ జగన్ తమ కుటుంబానికి కొండంత అండగా నిలుస్తున్నారన్నారు. సీజీసీ సభ్యుడు గంపల వెంకట రమణ మాట్లాడుతూ జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్తా బాధ్యతగా పని చేయాలన్నారు.
 పని చేయని వారిని ఉపేక్షించబోం..
 మండలస్థాయిలో బూత్ కమిటీలు, గ్రామ కమిటీలపై నెలాఖరులోగా కసరత్తు పూర్తి చేయాలని మండల కన్వీనర్లకు కుడుపూడి సూచించారు. ఇందులో విఫలమైన వారి వివరాలను కేంద్ర కమిటీకి ఫ్యాక్స్ ద్వారా పంపిస్తామన్నారు. పని చేయని నేతలను ఉపేక్షించేది లేదని కేంద్ర కమిటీ ఆదేశించిందన్నారు. ఇందుకు ఏ స్థాయి నాయకుడూ అతీతం కాదన్నారు. ఈ నెల 30 వరకూ ఓటరు జాబితా సవరణలకు ఎన్నికల సంఘం అవకాశమిచ్చిందని, నేతలు గ్రామస్థాయిలో ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాలు పరిశీలించాలని ఆదేశించారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్ని పార్టీ ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర కమిటీ పంపిన లేఖను జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు చదివారు.
 సమావేశంలో మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ విభాగం కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు చెల్లుబోయిన వేణు, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, విప్పర్తి వేణుగోపాలరావు, మందపాటి కిరణ్‌కుమార్, తోట సుబ్బారావునాయుడు, దాడిశెట్టి రాజా, మత్తి జయప్రకాష్, వివిధ సెల్‌ల జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, అనంత ఉదయభాస్కర్, మార్గన గంగాధర్, నయీం భాయి, రొంగల లక్ష్మి, గెడ్డం రమణ, గారపాటి ఆనంద్, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మార్గాని రామకృష్ణ గౌడ్, వాసిరెడ్డి జమీల్, ఎన్.వసుంధర, కాకినాడ సిటీ కన్వీనర్ ఫ్రూటీ కుమార్, జక్కంపూడి రాజా, అద్దేపల్లి శ్రీధర్, వేగిరాజు సాయిరాజు, ఆర్.వి.వి.సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement