సాక్షి, కొత్తగూడెం
కాంగ్రెస్ వర్గాల మధ్య రాజుకున్న అగ్గి ఇంకా చల్లారలేదు. కత్తులు దూసుకుంటున్న ఇరువురు ప్రధాన నేతలు ఒకరు భాగ్యనగరంలో, మరొకరు హస్తినలో పావులు కదుపుతున్నారు. తెలంగాణవాదంతో జిల్లా నుంచి రేణుకాచౌదరిని సాగనంపాలని మంత్రిరాంరెడ్డి ఎత్తులు వేస్తే.. దీనికి పైఎత్తుగా కల్లూరులో ఫ్లెక్సీ చించివేత వ్యవహారంపై హస్తినలో అధిష్టానం పెద్దలకు రేణుక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనతో పాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఉన్న ఫ్లెక్సీలను మంత్రి రాంరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి వర్గీయులే చించారని అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె వర్గీయులు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఆమె ఫ్లెక్సీని చించితే సోనియాగాంధీ ఫ్లెక్సీ చించారని ఫిర్యాదు చేసి యాగీ చేశారనే ఆరోపణలున్నాయి. గతంలో మాదిరిగానే మళ్లీ పావులు కదిపి ఇటు మంత్రిని, అటు పొంగులేటిని అధిష్టానం వ్యతిరేకులుగా చిత్రీకరించే పనిలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది.
రాజకీయంలో ఆమె జిత్తులు తెలిసిన మంత్రి.. ముందే ఆమెపై చేసిన వ్యాఖ్యలతో పాటు, కల్లూరు ఫ్లెక్సీ చించివేత విషయమై మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబుతో చర్చించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈనెల 21న నిర్వహించనున్న తెలంగాణ కృతజ్ఞత సభ విషయమై తెలంగాణ నుంచి ఎవరిని ఆహ్వానించాలని, రేణుక అంశంపై మాట్లాడినట్లు సమాచారం. రేణుక హస్తినలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని, తనకు మద్దతుగా ఉండాలని మంత్రి వారిని కోరినట్లు తెలిసింది.
రేణుకపై మంత్రి సోదరుడి ఆగ్రహం..
నాలుగు రోజులుగా ఢీల్లీలో ఉన్న మంత్రి సోదరుడు, సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి హూటాహుటిన తన సోదరునికి మద్దతు ఇచ్చేందుకు ఖమ్మం చేరుకున్నారు. మంత్రి హైదరాబాద్‌లో ఉండగానే ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రేణుకపై విమర్శలు గుప్పించారు. ‘ఎక్కడో... విశాఖపట్నం జిల్లాలో పుట్టిన నీవు... మమ్మల్ని దమ్ముందా అని ప్రశ్నిస్తున్నావా...? మహిళను అని మర్చిపోయి మాట్లాడుతున్నావు... మా దమ్మేందో చూపిస్తాం రా’ అంటూ సవాల్ విసిరారు. ఈ నెల 21న సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపే సభకు వచ్చే అర్హత రేణుకకు లేదన్నారు. ఒకవేళ వస్తే ఈ ప్రాంత ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమకారులను హేళన చేసేలా మాట్లాడిన ఆమె క్షమాపణ చెప్పాలన్నారు. హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశానికి పిలవకుండా హాజరయ్యారని, చాలా మంది బహిరంగంగానే ఆమె రాకను వ్యతిరేకించినా.. ఎలా సమావేశంలో కూర్చున్నారు.. అని ఆయన దుయ్యబట్టారు. వ్యూహాత్మకంగానే మంత్రి తన సోదరుడిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అవసరమైతే జిల్లా ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ఆమె వ్యవహారంపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని దామోదర్‌రెడ్డి మంత్రి అనుచరులకు భరోసానిచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా రేణుకకు మద్దతిస్తున్న మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఇలాకా కొత్తగూడెంలో గాంధీపథం జిల్లా కన్వీనర్ బూసిరెడ్డి శంకర్‌రెడ్డితో విలేకరుల సమావేశం పెట్టించి.. రేణుకపై విమర్శలు చేయించి ఆమె మద్దతుదారులకు మంత్రి రాంరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి సవాల్ విసిరారు.
అలాగే పీసీసీ సహాయ కార్యదర్శి మానవతారాయ్.. ‘ రాజ్యసభకు ఇచ్చిన పత్రంలో రేణుక స్వస్థలం విశాఖపట్టణం అని పేర్కొన్నారని..తెలంగాణ ప్రజలను రేణుకాచౌదరి మోసం చేస్తున్నారని’ సత్తుపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇలా ఇటు మంత్రి, అటు పొంగులేటి అనుచరులు ఎదురుదాడికి దిగడంతో రేణుక అనుచరులు గుంభనంగా ఉంటూ ఆమె ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
పాలేరులో సమావేశం పెట్టే యోచన..?
తన అనుంగు అనుచరులతో పాలేరులో సమావేశం పెట్టి మంత్రిని ఇరకాటంలో పెట్టేందుకు రేణుక ఎత్తుకుపైఎత్తువేసే యోచనలో ఉన్నట్లు ఆమె అనుచరులు చర్చించుకుంటున్నారు. ఖమ్మంలో ఉన్న తన అనుచరులందరినీ అక్కడి తరలించి మంత్రికి నియోజకవర్గంలో పట్టు లేదని, తనకే ఉందని అధిష్టానం చెవిలో వేయాలని ఆమె ఆదిశగా కసరత్తుచేస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఖమ్మంలోని తన ముఖ్య అనుచరులతో పాలేరులో సమావేశం సాధ్యాసాధ్యాలపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. విజయదశమి తర్వాత, లేదా తెలంగాణ కృతజ్ఞత సభకు ముందే ఆమె పాలేరులో సమావేశం ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఒకవేళ పాలేరు కాని పక్షంలో ఖమ్మంలోనైనా సమావేశం నిర్వహించి తనవెంట ముఖ్య నేతలందరూ ఉన్నారని బలప్రదర్శనకు దిగవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇలా ఇరువర్గాల నేతలు ఎవరికి వారు ఎత్తుకుపైఎత్తులు వేస్తుండడంతో చివరకు తెలంగాణ కృతజ్ఞత సభ జరుగుతుందో లేదోనని పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది.
తారస్థాయికి కాంగ్రెస్ వర్గపోరు
Published Sun, Oct 13 2013 2:19 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement