బాల్కొండ, న్యూస్‌లైన్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ భాగన రూ.6 కోట్లతో ఇరిగేషన్ అధికారులు పార్కును ఏర్పాటు చేశారు. పనులు పూర్తి కావడంతో గత నెల 29న భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ కలిసి పార్కును ప్రారంభించారు. కానీ ఈ ప్రారంభం అధికారులకు, పాలకులకు మాత్రమే. ఇంత వరకు ఒక్క పర్యాటకున్ని కూడా లోపలికి అనుమతించలేదు. కారణం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యమేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పర్యాటకంగా అభివృద్ధి పర్చేందుకు పార్కు, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. 2009లో పనులకు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ పూర్తి చేసి పనులు ప్రారంభించారు.
ఏడాది కాలంలో పూర్తి కావాల్సిన పనులు నాలుగేళ్లు దాటినా పూర్తి కాలేదు. ఎట్టకేలకు ఇటీవల పనులు పూర్తయ్యాయి. నాలుగేళ్లుగా అధికారులు పార్కును ఎవరు పర్యవేక్షించాలోనన్న అలోచనే చేయలేదు. తీరా పనులు పూర్తయ్యాక పర్యవే క్షణ చేసేందుకు తమ వద్ద సిబ్బంది లేరంటూ ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు. ఉన్న ప్రాజెక్ట్ సంరక్షణకే సిబ్బంది దిక్కు లేదు. ఈ విషయం అధికారులకు ముందే తెలిసినా ఏరోజూ ఆవైపుగా ఆలోచన చేయలేదు. పార్కు సస్యశ్యామలంగా పచ్చదనంతో ఉండాలంటే ప్రతీరోజు కనీసం 20 మంది కూలీలు పనిచేయాలి. దీంతో ప్రాజెక్ట్ అధికారులు ప్రస్తుతం ఏదైన ఏజెన్సీకి పర్యవేక్షణ బాధ్యతలు టెండర్ ద్వారా అప్పగించాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బాధ్యతలను త్వరగా అప్పగిస్తే పార్కు సందర్శిస్తామంటూ పర్యాటకులు కోరుతున్నారు.
ఇన్నాళ్లు ఏం చేశారు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పనులు అంటేనే అధికారులకు ఒకింత నిర్లక్ష్యం ఉంటుందని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. పార్కు పనులు సకాలంలో పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా ఏడాది కాలంలో పూర్తి కావల్సిన పనులు నాలుగేళ్లకు పూర్తయ్యాయి. నాలుగేళ్లుగా పార్కును ఎలా తీర్చి దిద్దుతారో అధికారుల వద్ద పుటాలు పటాలున్నాయి. పార్కు ప్రారంభానికి ముందే ఎజె న్సీ ద్వారానో. లేక టూరిజం శాఖకో పార్కు పర్యవేక్షణ అప్పగించేలా మాత్రం అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదు. పూర్తయిన తర్వాతనైనా పార్కు ప్రారంభానికి సత్వర చర్యలు ఎందుకు చేపట్టడం లేదని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్కు సమస్యను పరిష్కరించి, సందర్శనకు అనుమతివ్వాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు.
పర్యాటకులకు నిరాశే
Published Mon, Jan 6 2014 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement