వెంటాడిన మృత్యువు
- బోయకొండ గంగమ్మకు మొక్కులు చెల్లించి వస్తూ ...
- ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరి మృతి
- 35 మందికి గాయాలు
- బోడేవారిపల్లెలో విషాదఛాయలు
వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు బాగా పండాలని ఆశపడ్డారు. తమ కోర్కెలు నెరవేర్చాలని రెండు ట్రాక్టర్ల ద్వారా బోయకొండ గంగమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. విందు భోజనాలు చేసి, సాయంత్రం ఇళ్లకు బయలుదేరారు. అయితే వారిని మృత్యువు వెంటాడింది. మార్గమధ్యంలో ఓ ట్రాక్టర్ బోల్తాపడడంతో ఇద్దరు మృతిచెందారు. 35 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన చౌడేపల్లె మండలం బోడేవారిపల్లెలో ఆదివారం విషాదాన్ని నింపింది.
చౌడేపల్లె : చౌడేపల్లె మండలం బోడేవారిపల్లె వాసులకు బోయకొండ గంగమ్మ అంటే అపారమైన భక్తి. ప్రతి ఏటా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆదివారం గ్రామస్తులంతా రెండు ట్రాక్టర్లలో బోయకొండకు వెళ్లారు. అమ్మవారికి జంతుబలులిచ్చి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సహపంక్తి భోజనాలు చేసి సాయంత్రం ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో పక్షిరాజపురం సమీపంలోని గాజుమాకులమిట్ట వద్ద చిన్నపాటి లోయలోకి ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పీ.వెంకట్రమణకుమారుడు పీ.వెంకటేష్,(26), ఆంజనేయులు కుమారుడు పీ.బాలాజీ(25) ట్రాక్టర్ ట్రాలీ కింద చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు.
మరో 35 మంది గాయపడ్డారు. స్థానికులు, భక్తులు పెద్దఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెలికితీయడానికి తీవ్రం గా శ్రమించారు. ట్రాక్టర్ క్యాబిన్ లో కింద చిక్కుకుని మృత్యువుతో పోరాడుతున్న వెంకటేష్ అనే యువకుడిని అతి కష్టంమీద ప్రాణాలతో బయటకు తీశారు. క్షతగాత్రులను 108 సిబ్బంది మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిత్తూరు డీటీసీ ప్రసాద్ ఆధ్వర్యంలో మదనపల్లె ఎంవీఐ సుబ్రమణ్యం, ఎస్‌ఐ శ్రీనివాసులు, ఈవో ఏకాంబరం, స్థానిక యువకులు జేసీబీ సహాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.