పోలీస్ శిక్షణలో మిస్సింగ్!
Published Sun, Sep 8 2013 2:39 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
గరివిడి, న్యూస్‌లైన్: ఏపీఎస్‌పీ కానిస్టేబుల్‌గా ఎంపికై ఐదవ బెటాలియన్ చింతలవలసలో శిక్షణ పొందుతున్న తన కుమారుడు గేదెల బాలబాబు ఈ నెల 3వ తేదీ నుంచి కనిపిండడం లేదని అతని తల్లి వాపోతోంది. ఈ సంఘటనపై గరివిడి మండలం కోడూరు గ్రామానికి చెందిన గేదెల సావిత్రమ్మ తన కుమారుడి ఫొటోతో సహా పత్రికలకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 3న బెటాలియన్‌కు చెందిన కొంతమంది కానిస్టేబుళ్లు కోడూరులోని తమ ఇంటికి వచ్చి మీ అబ్బాయి బాలబాబు ఇంటికి వచ్చాడా? అని అడిగారని ఆమె పేర్కొన్నారు.
దీనిపై కంగారు పడి 4వ తేదీన చింతలవలస బెటాలియన్‌కు వెళ్లి అక్కడి ఎస్‌ఐని తమ అబ్బాయి ఏమయ్యాడని అడిగానని తెలిపారు. తమ అబ్బాయి బాలబాబుకి జ్వరం రావడంతో గౌరీశంకర్ అనే కానిస్టేబుల్‌ను ఎస్కార్ట్‌గా ఇచ్చి తిరుమల ఆస్పత్రికి పంపించామని తిరిగి మీ అబ్బాయి బెటాలియన్‌కు రాలేదని ఎస్‌ఐ సమాధానం ఇచ్చారన్నారు. దీనిపై బెటాలియన్ డీఎస్పీకి ఫిర్యాదు చేయగా బాలబాబును వెతుకుతున్నామని ఆచూకీ తెలిసిన వెంటనే సమాచారం ఇస్తామని ఆయన చెబుతున్నారని సావిత్రమ్మ వాపోయారు. తన కుమారుడి ఆచూకీ తెలియజేయాలని పోలీస్ అధికారులను ఆమె వేడుకుంటున్నారు.
Advertisement