ట్రామాకేర్..లెస్సే!
శ్రీకాకుళం కలెక్టరేట్: పదే పదే జాబితాలు సవరిస్తున్నా.. మళ్లీ మళ్లీ అవే తప్పులు.. ఒక జాబితాలో ఉన్న పేరు మరో జాబి తాలో కనిపించదు. ఒక జాబితాలో అర్హులుగా ఉన్న వారే.. ఇంకో జాబితాలో అనర్హులుగా మారిపోతున్నారు. ఇవన్నీ రిమ్స్ అధికారుల లీలలు. అంతులేని నిర్లక్ష్యమో.. అలవిమాలిన అవినీతో.. రిమ్స్‌లోని ట్రామాకేర్ ఉద్యోగ నియామక ప్రక్రియను రోజుకో మలుపు తిప్పుతూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ప్రకటించిన ఎంపిక జాబితాలో ఎలక్ట్రీషియన్ పోస్టుకు సంపతిరావు సన్యాసిరావు అనే అభ్యర్థి ఎంపికైనట్లు పేర్కొన్నారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన జాబితాలో అతని పేరు గల్లంతైంది. పైగా ఈ పోస్టుకు అభ్యర్ధులే లేరని నోటు పెట్టి మరీ జాబితా విడుదల చేయడం విశేషం. ట్రామాకేర్ విభాగంలో వివిధ కేటగిరీలకు చెందిన 43 పోస్టుల భర్తీకి 2013 నవంబరు నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆ మేరకు పెద్ద సంఖ్యలో అందిన దరఖాస్తులను పరిశీలించి ఈ ఏడాది జనవరి 10, 11 తేదీల్లో మెరిట్ జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో పూర్తిగా తప్పులున్నాయని ఫిర్యాదలు రావడం.. తప్పులను ఎత్తిచూపుతూ ‘సాక్షి’లో పలు వార్తా కథనంలో ప్రచురితం కావడంతో ఆ జాబితాను నిలిపివేశారు. కాగా జనవరి 10నాటి జాబితాలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగానికి రోస్టర్, మెరిట్ ఆధారంగా బీసీ-ఏ అభ్యర్థి సన్యాసిరావు ఎంపికైనట్టు ప్రకటిం చారు. ఈయనకు 74 మార్కులు రావడంతో బీసీ-ఏ కేట గిరీలో ఆయన్ను అర్హుడిగా పేర్కొంటూ జాబితాలో చేర్చారు. అయితే మంగళవారం విడుదల చేసిన తుది జాబితాలో తన పేరు కనిపించకపోవడంతో సన్యాసిరావు హతాశుడయ్యారు. దీనికి తోడు ఎలక్ట్రీషియన్ పోస్టుకు 80 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే.. అసలు దరఖాస్తులే లేవని, అర్హులు లేరని ఎంపిక జాబితా కింద అధికారులు ప్రత్యేక నోట్‌లో పేర్కొనడం పట్ల విస్మ యం వ్యక్తమవుతోంది.
పైగా కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ జాబితా రూపొందించామ ని పేర్కొనడం విశేషం. వాస్తవానికి మెరిట్ జాబితాను గానీ.. ఎంపిక జాబితాను గానీ కలెక్టర్ పరిశీలించిన దాఖలాలు లేవు. జనవరి నెలలో ప్రకటించిన మెరిట్ జాబితాలో తప్పులు ఉన్నాయని, రిమ్స్ అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతోపాటు, పలువురు అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సుమారు ఆరు నెలలపాటు ఈ నియామకాలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు విడుదల చేసిన ఎంపిక జాబితాలోనూ అటువంటి తప్పులే పునరావృతం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి తప్పులు చేయడం రిమ్స్ అధికారులకు ఇదే తొలిసారి కాదు. జాబితాలను తారుమారు చేసి తాము అనుకున్న వారికి.. కోరుకున్న చోట ఉద్యోగాలు ఇవ్వడం వారికి పరిపాటేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.