కష్టపడితేనే..కరెంటిస్తాం!
మీ గ్రామాలకు కరెంటు కావాలా?.. అయితే శ్రమదానం చేయండి.. వాలిపోయిన స్తంభాలు నిలబెట్టండి.. చెట్లలో వైర్లు చిక్కుకున్నాయి.. చెట్లు కొట్టండి.. విద్యుత్ స్తంభాలు మోసుకెళ్లండి.. అప్పుడు కరెంటిస్తాం.. ఇదీ గిరిసీమలో ట్రాన్స్‌కో వారి దందా. విద్యుత్ పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ నిధులు ఖర్చు చేయకుండా వెనకేసుకుంటున్నారు. గిరిజనులను శ్రమదోపిడీకి గురి చేస్తూ పనులు జరిపించేస్తున్నారు. నిధుల విషయం తెలియని అమాయక గిరిజనులు కరెంటు కోసం ట్రాన్స్‌కో సిబ్బంది చెప్పినట్లు చేస్తున్నారు.
సీతంపేట:ఏజెన్సీలో తుపానుకు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనుల ను గిరిజనులతో చేయిస్తూ.. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరు కష్టపడితేనే.. త్వరగా కరెంటు వస్తుందని మభ్యపెట్టి పైసా అయినా ఇవ్వకుండా వారితో స్తంభాలు మోయించడం, నిలబెట్టడం, చెట్లు కొట్టించడం వంటి పనులు చేయించారు. సీతంపేట ట్రాన్స్‌కో సబ్‌డివిజన్ పరిధిలో హుదూద్ తుపాను ధాటికి విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. పునరుద్ధరణ పనులకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే కూలీలతో చేయించాల్సిన పనులను గిరిజనులతో చేయిస్తూ కొందరికి నామమాత్రంగా కూలి చెల్లించారు. ఇంకొందరికి పూర్తిగా చెల్లించకుండా ఎగవేశారు. ఇలా ఈ సబ్‌డివిజన్ పరిధిలో రూ.13 లక్షల వరకు నిధులు పక్కదారి పట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇవీ లెక్కలు
సీతంపేట సబ్‌డివిజన్ పరిధిలో సీతంపేట, పాలకొండ, బూర్జ, వంగర, వీరఘట్టం మండలాలున్నాయి. తుపాను దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ మరమ్మతులకు సబ్ డివిజన్‌కు సుమారు రూ.24 ల క్షలు మంజూరయ్యాయి. ఇందులో వీరఘట్టం మండలానికి రూ.1.50 లక్షలు కేటాయించగా మిగిలిన నాలుగు మండలాలకు రూ.5.5 లక్షలు చొప్పున విడుదల చేశారు. ఈ నిధులతో మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా సీతంపేట, బూర్జ, వంగర మండలాల్లో అధిక శాతం నిధులు దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. ఈ మండలాల్లో 211 విద్యుత్ స్తంభాలు పాడవ్వగా 104 కొత్త స్తంభాలు నిర్మించారు. ఈ నెల 13 నుంచి 21 వరకు పునరుద్ధరణ పనులు జరిపారు. కొండలపైనున్న గ్రామాలకు స్తంభాలు మోసుకెళ్లడం, ఇంకొన్ని గ్రామాలకు నాటుబళ్లతో పరికరాలు పట్టుకెళ్లడం వంటి పనులను గిరిజనులే చేశారు. ఇందుకోసం రోజుకు 60 నుంచి 70 మంది వరకు కూలీలను వినియోగించినట్లు లెక్కలు చూపి, 10 నుంచి 15 మందికి మాత్రమే కూలి చెల్లించినట్లు సమాచారం.
సాధారణంగా ఇటువంటి పనులకు ఒక్కో కూలీకి రోజుకు రూ.500 చెల్లించాలి. అలాగే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాల్సి ఉంది. అయితే ఏ ఒక్కరికీ భోజనాలు పెట్టిన దాఖలాలు లేవు. వీరితో పనులు చేయించిన ట్రాన్స్‌కో కిందిస్థాయి సిబ్బందికి సైతం భోజనాలు పెట్టాల్సి ఉన్నప్పటకీ వారికి కూడా పెట్టలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే డిపార్ట్‌మెంటు వారితోనూ, ట్రాన్స్‌కో ఫ్రాంచైజీ సంస్థతోనూ కొన్ని పనులు చేయించినా, ప్రైవేట్ వారితో చేయించినట్లుగా బిల్లులు పెట్టారని తెలిసింది. ఇదిలా ఉండగా ఇప్పటికీ ఇంకా మారుమూల గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏడీఈ అప్పారావు వద్ద ప్రస్తావించగా కూలీలందరికి ఒక కాంట్రాక్టర్ ద్వారా డబ్బులు చెల్లించామని చెప్పారు.
శ్రమదానంతో చేయించారు
అన్ని పనులు శ్రమదానంతో చేయించారు. కూలీలకు డబ్బులు ఇవ్వలేదు. పనులు పూర్తి అయితే గ్రామాలకు విద్యుత్ వస్తుందంటేనే మా గిరిజనులంతా సాయం చేశారు గానీ ఎవ్వరికి డబ్బులు ఇవ్వలేదు.
- సవర గోపాల్, సర్పంచ్, సోమగండి
పైసా ఇవ్వలేదు
పైసా డబ్బులు ఇవ్వలేదు. కొండలపైకి స్తంభాలు మోసుకెళ్లాం. ఎవ్వరికీ కూలీ చెల్లించలేదు. కరెంటు వస్తాదన్న ఆశతో మా పనులు మానుకొని అనేక కష్టాలకు ఓర్చి పనులు చేశాం.
- సవర తోటయ్య, గొయ్యిగూడ