- ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సబ్ రిజిస్ట్రార్లు
- హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
విజయవాడ : ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఇటీవల చేసిన బదిలీలపై పలువురు సబ్ రిజిస్ట్రార్లు న్యాయపోరాటానికి దిగారు. అక్రమ బదిలీలను ఆకస్మికంగా చేశారంటూ జిల్లాకు చెందిన సబ్ రిజిస్ట్రార్లు ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు బదిలీలకు సంబంధించి సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఆకస్మిక బదిలీలతో ఇబ్బందులే..
రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30 తేదీన రాష్ట్రవ్యాప్తంగా జీరో సర్వీసు జీవో ప్రకారం మూకుమ్మడిగా సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో 30 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. వారు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. సంవత్సరం మధ్యలో ఆకస్మికంగా బదిలీచేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వివరించారు. కౌన్సెలింగ్ జరపకుండా ప్రభుత్వం ఇష్టానుసారం బదిలీ చేసిందని, ఇది చట్టవిరుద్ధమని పిటిషన్లలో పేర్కొన్నారు.
నందిగామ, కంకిపాడుల్లో సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేసిన రాంబాబు, రాఘవరావుతో పాటు పలువురు శుక్రవారం ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేర్వేరుగా దాఖలు చేశారు. వీటిని ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది. బదిలీల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలను వచ్చే బుధవారంలోగా సమర్పించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఏలూరు డీఐజీ సాయిప్రసాద రెడ్డిని ట్రిబ్యునల్ ఆదేశించింది.
తదుపరి విచారణ అనంతరం ట్రిబ్యునల్ నుంచి తీర్పు వెలువడనుంది. ఇదిలాఉంటే.. జిల్లాలో పది మంది సబ్ రిజిస్ట్రార్లు బదిలీ జరిగినప్పటికీ చార్జి అప్పగించకుండా, బదిలీ అయిన ప్రదేశానికి వెళ్లలేదని సమాచారం. దీనివల్ల రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలుగుతోంది. బదిలీలు అస్తవ్యస్తంగా జరిగాయని కంకిపాడు ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ సిటిజన్ శుక్రవారం హైకోర్టులో పిల్ వేశారు. జిల్లాలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందులో పేర్కొన్నారు.
బదిలీలు రద్దు?
ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో జరిగిన బదిలీలు రద్దవుతాయని తెలుస్తోంది. ప్రభుత్వం రూపొందించిన జీరో సర్వీసు నిబంధన చట్టవిరుద్ధమని, బదిలీలు కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే జరగాల్సి ఉండగా సర్వీసు రూల్స్‌ను పక్కనపెట్టి ఉత్తర్వులు జారీ చేయడం తగదని పలువురు పేర్కొంటున్నారు. వచ్చే వారంలో బదిలీలన్నీ రద్దవుతాయని పెద్దఎత్తున ప్రచారం నడుస్తోంది.