ఓర్వకల్లు: ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో విమానం దిగింది. సోమవారం నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైంది. ఈ నెల 7న ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్న నేపథ్యంలో ట్రయల్‌రన్ కోసం విజయవాడ నుంచి బయలుదేరిన చిన్నపాటి విమానం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇక్కడికి చేరుకుంది. అందులో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, నెల్లూరు ఎయిర్‌పోర్టు అథారిటీ ఎండీ ఉమేష్, పైలెట్, కో–పైలెట్‌తో సహా ఐదుగురు విచ్చేశారు. వారికి కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ ఫక్కీరçప్ప, ఎయిర్‌పోర్టు అథారిటీ ఎండీ వీరేందర్‌సింగ్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమానం వద్దకు వెళ్లి స్వాగతం పలికారు.
అనంతరం వారు రన్‌వే, అప్రోచ్ రోడ్డు, విమానాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. మీడియా సమావేశంలో అజయ్ జైన్ మాట్లాడుతూ పారిశ్రామిక హబ్, ఎయిర్‌పోర్టు, అల్ట్రా మెగా సోలార్ పార్కు వంటి ప్రాజెక్టులతో కర్నూలు జిల్లాకు భవిష్యత్‌లో మహర్దశ రానున్నట్లు చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టుకు 2017 జూన్ 21న శంకుస్థాపన చేశామని, జిల్లా వాసులకు ఇచ్చిన మాట ప్రకారం 18 నెలల్లోనే దాదాపు అన్ని పనులు పూర్తిచేశామని అన్నారు. వంద శాతం పనులు పూర్తికావడానికి మరో మూడు నెలలు పడుతున్నందున ఏప్రిల్ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
ఎయిర్‌పోర్టు కోసం భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల్లో అర్హులైన వారికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సమావేశంలో ఎయిర్‌పోర్టు జీఎం వంశీకృష్ణ, కర్నూలు ఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నరేంద్రనా«థ్‌రెడ్డి, ఎంపీడీఓ మాధవీలత తదితరులు పాల్గొన్నారు.
వీక్షకులకు నిరాశ
ట్రయల్‌రన్‌ను వీక్షించేందుకు ఓర్వకల్లు మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు ఉదయాన్నే ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. అయితే.. వారిని పోలీసులు జాతీయ రహదారిపై గల ప్రధాన గేటు వద్దనే నిలువరించారు. పనులు పూర్తి చేయకుండానే విమానాశ్రయాన్ని ప్రారంభిస్తుండడంతో ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని ఎవరినీ లోపలికి అనుమతించలేదంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment