
ట్రిపుల్‌ఐటీలు శాస్త్రవేత్తల ఉత్పత్తి కేంద్రాలు కావాలి
ఎంతో ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీలు దేశానికి ఉపయోగపడే శాస్త్రవేత్తల ఉత్పత్తి కేంద్రాలుగా మారాలని సబ్‌కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు ఆకాంక్షించారు.
- సబ్ కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్‌బాబు
నూజివీడు, న్యూస్‌లైన్ : ఎంతో ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీలు దేశానికి ఉపయోగపడే శాస్త్రవేత్తల ఉత్పత్తి కేంద్రాలుగా మారాలని సబ్‌కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు ఆకాంక్షించారు. నూజి వీడు ట్రిపుల్ ఐటీలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న సిగ్నస్-14 క్రీడ, వార్షిక వేడుకలు సోమవారం రాత్రి ముగి శాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటి సాధన కోసం కృషిచేయాలని సూచించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జనరల్ మేనేజర్(విజయవాడ) సీతాపతిశర్మ మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు.
నాసా యాత్రకు ఆర్థికసాయం ప్రకటించిన జీఎం
నాసా యాత్రకు ఎంపికైన విద్యార్థుల్లో పది మందికి అవసరమైన ఆర్థికసాయం అందజేస్తామని ఎస్‌బీహెచ్ జీఎం సీతాపతిరావు వేదికపై ప్రకటించారు. ఈ ఏడాది నాసా కాంటెస్ట్‌కు 18 ప్రాజెక్టులకు సంబంధించిన 57 మంది విద్యార్థులు ఎంపికైన సంగతి తెలిసిందే. వీరిలోచాలా మంది విద్యార్థులు పేద, మధ్యతరగతి వర్గాల వారు కావడంతో అమెరికా వెళ్లే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈ విషయాన్ని డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ జీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. పది మంది విద్యార్థులకు రూ.15లక్షల వరకు ఎస్‌బీహెచ్ స్పాన్సర్ చేస్తుందని ప్రకటించారు.
గేట్‌లో ర్యాంకర్లకు బహుమతులు
గేట్‌లో ర్యాంక్‌లు సాధించిన పలువురు విద్యార్థులకు హైదరాబాద్‌కు చెందిన టైమ్స్ ఇనిస్టిట్యూట్ ప్రోత్సాహక బహుమతులు అందజేసింది. వీటిని సబ్‌కలెక్టర్‌చక్రధర్‌బాబు, జీఎం సీతాపతిశర్మ చేతుల మీదుగా అందజేశారు. గేట్‌లో 25వ ర్యాంకు సాధించిన గురిజాల మహేష్‌కు రూ.25 వేలు, 30వ ర్యాంకు సాధించిన జి.శ్రీరాములునాయుడుకు రూ.25 వేలు, 196వ ర్యాంకు, 365వ ర్యాంకు సాధించిన హేమంత్‌కుమార్, చీకట్ల సతీష్‌కు రూ.10 వేల చొప్పున, 839వ ర్యాంకు సాధించిన చల్లా రాముకు రూ.5వేల చొప్పున అందజేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. ఓఎస్‌డీ జి.రామకృష్ణారెడ్డి, పీఆర్వో వీరబాబు, అధ్యాపక బృందం, మెంటార్లు, ఫ్యాకల్టీలు తదితరులు పాల్గొన్నారు.