ఈ-పోస్.. ఓ ఫార్సు
పోర్టబులిటీతో తంటాలు
ఉదయం పూట సర్వర్ బీజీ
గంటల తరబడి కార్డుదారుల పడిగాపులు
కూలీల బాధలు వర్ణణాతీతం
గాంధీనగర్ : పౌరసరఫరాల శాఖలో ఏర్పాటు చేసిన ఈ-పోస్ యంత్రాలు కార్డుదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. విద్యుత్ లేకపోయినా, సర్వర్ బిజీగా ఉన్నా, వేలిముద్రలు నమోదుకాకున్నా గంటలతరబడి సరకుల పంపిణీ నిలిచిపోయి కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపులు పనిచేయాలి.
అయితే కార్డుదారుల్లో కూలీలే ఎక్కువమంది కావడంతో ఉదయాన్నే షాపులకు వెళ్తున్నారు. దీంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ముందుగా వేలి ముద్రలు సేకరించి, సరకులు పంపిణీచేస్తారు. అయితే వేలి ముద్రల గుర్తింపులోనే ఎక్కువ జాప్యం జరుగుతోంది. వేలిముద్రలు పడకపోతే ఎదురుచూపులు తప్పడంలేదు.
పోర్టబులిటీతో తంటాలు
దశాబ్దాల కాలంగా కార్డుదారులు తమకు కేటాయించిన షాపుల్లో సరకులు తీసుకెళ్లారు. ఈ-పోస్ విధానంలో కార్డుదారు తనకు సమీపంలోని ఏ రేషన్‌షాపు నుంచైనా సరకులు పొందేలా పోర్టబులిటీ సౌకర్యం కల్పించారు. ఇక్కడే సమస్య ఎదురవుతోంది. రేషన్‌షాపులకు కార్డుల సంఖ్య ఆధారంగా సరకులు కేటాయిస్తున్నారు. పోర్టబులిటీని ఉపయోగించుకుని ఇతర దుకాణాల పరిధిలోని లబ్ధిదారులు ముందుగా ఎవరైనా సరకులు తీసుకెళ్తే ఆ మేరకు స్టాకు తగ్గిపోతుంది. తర్వాత వచ్చే కార్డుదారులు ఇతర దుకాణాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇలా వెళ్లేందుకు ఇష్టపడని లబ్ధిదారులు డీలర్లతో వాదనకు దిగుతున్నారు.
శివారు గ్రామాల ప్రజల బాధలు వర్ణణాతీతం
శివారు ప్రాంతా గ్రామాల ఈ-పోస్ విధానానికి ముందు నాలుగైదు కుటుంబాల నుంచి ఒకరో ఇద్దరో వాహనంపై వెళ్లి అందరి సరకులు తెచ్చుకునేవారు. ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒకరు కచ్చితంగా వెళ్లాల్సి వస్తోంది. అవినీతి నిరోధించాల్సిన మాట వాస్తవమే అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించకుండా ఈ విధానం ప్రవేశ పెట్టడం వల్ల రోజూ కూలి చేసుకునే కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.
వీరులపాడు మండలం రంగాపురం కార్డుదారులు సరకుల కోసం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జుజ్జూరు గ్రామానికి వెళ్లాలి. అటవీప్రాంతంలోని తిమ్మాపురం వాసులు 6కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దాపురం వెళ్లాలి. జయంతి బీసీ కాలనీ వాసులు రేషన్‌దుకాణానికి వెళ్లాలంటే 2కిలోమీటర్ల నడవాల్సిందే. చాట్రాయి మండలం పిట్టల వారిగూడెం కార్డుదారులు కిలోమీటర్ దూరంలో ఉన్న నరసింహారావుపాలెం వెళ్లాల్సి వస్తోంది. ఇదే మండలం జగన్నాథపురం వాసులు సోమవారం 2.5కిలోమీటర్లు, కరుణాపురం వాసులు సూరంపాలెం 2కిలోమీటర్లు వెళ్లక తప్పదు. జి.కొండూరు మండలం సాల్మన్‌రాజు నగర్ వాసులు 1.5కిలోమీటర్ల దూరంలో ఉన్న దుగ్గిరాలపాడు గ్రామానికి వెళ్లాలి.
ఇవిగో సమస్యలు
జూలై నెలలో విజయవాడలోని ఓదుకాణానికి చెందిన కార్డుదారులు పోర్టబులిటీ ఉపయోగించుకుని మరో దుకాణంలో సరకులు పొందారు. సదరు షాపు పరిధిలోని కార్డుదారులు వెళ్లేసరికే స్టాకు నిండుకుంది. వేరే దుకాణానికి వెళ్లాలని డీలర్ సూచించడంతో కార్డుదారులు గొడవకు దిగారు. పోనీ స్టాకు ఇవ్వాలని డీలర్ కోరితే అధికారులు ఇవ్వడంలేదు. అద్దె ఇళ్లలో నివసించేవారు తరచూ ఇల్లు మారుతుండడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి.
సిగ్నల్ లేదని తిప్పుతున్నారు
ఒకటో తారీకు నుంచి నాలుగురోజులుగా తీరుగుతున్నా రేషన్ దొరకలేదు. వేలిముద్రలు సరిగా పడడంలేదని, సర్వర్ పనిచేయడంలేదని, సిగ్నల్ అందడంలేదని డీలర్ రోజూ తిప్పించుకుంటున్నాడు. కొన్ని సమయాల్లో కరెంటు పోతే ఎదురుచూడక తప్పడంలేదు. ఈ మిషన్లు పెట్టినప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నాం. పనులు మానుకోవాల్సి వస్తోంది.
- ధనలక్ష్మి, గృహిణి