సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర అవతరణ వేడుకలకు నిరసన సెగ తగలనుంది. ఓ వైపు అవతరణ వేడుకలు బహిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ పిలుపు నిచ్చింది. మరోవైపు నవంబర్ 1న బ్లాక్ డేగా ప్రకటించిన టీఆర్‌ఎస్ జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ప్రకటించింది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా రాష్ర్ట అవతరణ వేడుకల్లో పాల్గొనడం లేదని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటు న్న పార్టీలు రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు దూరంగా ఉంటున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో శుక్రవారం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినాన్ని వేడుకగా చేసుకోవడం అర్థంలేని వ్యవహారంగా భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులు వేడకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో అధికారులు కూడా మొక్కుబడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే తెలంగాణవాదులు, ఉద్యమ సంస్థలు ఈ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి.
ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. జిల్లా అంతటా నిరసనలు తెలపాలని టీజేఎసీ నిర్ణయించింది. నవంబర్ 1న విద్రోహ దినంగా పాటించేందుకు జిల్లాలో తెలంగాణవాదులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలతోపాటు వివిధ సంఘాలు నిరసనలు, నల్లజెండాల ప్రదర్శనలకు సిద్ధమవుతున్నాయి. అవతరణ దినాన నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపాలని పలు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇదిలా వుండగా రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు నిర్వహించేందుకు ఆదిలాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్స్ సిద్ధమైంది. ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. గతంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో జిల్లాకేంద్రంలో ప్రధాన వేడుక జరిగే పోలీసు గ్రౌండ్‌తోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ భద్రత ఏర్పాట్ల వల్ల సామాన్య జనం హాజరయ్యే అవకాశం లేక పోవడంతో కేవలం అధికారులకే పరిమితం కానుంది.