అకాలవర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసింది.
సాక్షి, హైదరాబాద్: అకాలవర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసింది. టీఆర్‌ఎస్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు తదితర నేతలతో కూడిన బృందం శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసింది. తెలంగాణ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల మిరప, మొక్కజొన్న, చెరుకు, మామిడి, కూరగాయల పంటలు, కోళ్ల పరిశ్రమ, పాడి పశువులకు నష్టం కలిగిందని వారు గవర్నరుకు వివరించారు.
నష్టంపై గ్రామాల వారీగా సర్వే చేయించి బాధిత రైతుల రుణాలను రీ షెడ్యూలు చేయాలని కోరారు. దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 20 వేల పరిహారం, మృతి చెందిన వారి కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లను కోల్పోయిన వారికి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. గవర్నర్‌ను కలసిన వారిలో టీఆర్‌ఎస్ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొప్పుల ఈశ్వర్, కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, మొలుగూరి బిక్షపతి, హనుమంత్ షిండే, ఎంపీ జి.వివేక్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తదితరులు ఉన్నారు.