
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్.. ప్రభుత్వ, అధికార పార్టీ అనుకూల వైఖరి, ఏకపక్షధోరణి చివరకు ఆయన సీటుకే ముప్పుతెచ్చేలా పరిణమించింది. ఇటీవలి కొన్ని కీలక పరిణామాలు, ఆయనపై వచ్చిన ఫిర్యాదులతో ఎన్నికలకు ముందు ఆయన్ను డీజీపీగా తప్పించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే ఏపీలోని డీజీ కేడర్ పోలీసు అధికారుల జాబితాను పంపించాలని కొద్దిరోజుల క్రితం ఈసీ రాష్ట్రాన్ని కోరినట్టు తెలిసింది. ఏపీ డీజీపీగా ఆర్పీ ఠాకూర్ వ్యవహరిస్తుండగా ఈసీ డీజీల జాబితాను కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈసీ కోరడంతో ఏపీలోని డైరెక్టర్ జనరల్ (డీజీ) కేడర్ అధికారుల జాబితాను ప్రభుత్వం పంపించక తప్పలేదు. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన, ప్రస్తుతం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న డి. గౌతమ్ సవాంగ్, సీఆర్‌పీఎఫ్ డీజీ (ఢిల్లీ)గా డిప్యుటేషన్ పై ఉన్న వీఎస్‌కే కౌముది, జైళ్ల శాఖ డీజీ వినయ్‌రంజన్ రే, 1987 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబు, రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ పేర్లతో కూడిన జాబితా ఈసీకి చేరినట్టు సమాచారం.