చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు
సాక్షి, చెన్నై: అర్చక వారసత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పేర్కొన్నారు. హిందూ మతాన్ని కనుమరుగు చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తిరుమలలో భక్తులకు శ్రీవారి సేవ దక్కకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియమ నిబంధనలు తెలియని వారిని అధికారులుగా నియమించి ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అతి పెద్ద తప్పు చేస్తోందని, ఈ పద్ధతి మారాలని హెచ్చరించారు. రమణ దీక్షితులు మంగళవారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. స్వామివారిని తాకే శాస్త్రాధికారం ఒక్క ఆగమ అర్చకులకు మాత్రమే ఉందన్నారు. స్వామివారికి కైంకర్యమే మహాపుణ్యం అన్నారు. తిరుమల ఆలయంలో రాజకీయాలు సరికాదని, పాలకుల పాపాల కారణంగా రాష్ట్రానికి, భక్తులకు అశాంతితో పాటు స్వామివారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంతకాలం అవమానాలు భరించామని, ఇక ఓపిక లేదన్నారు. ప్రధాన అర్చకుడిగా ఉన్న తనకే తిరుమల శ్రీవారి ఆభరణాల వివరాలు తెలియడం లేదని రమణ దీక్షితులు పేర్కొన్నారు. ఆభరణాల వివరాలు, ఆలయ లెక్కలను బహిర్గతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
స్వామివారి ఆగ్రహం వల్లే పిడుగులు
అధికార బలంతో ఆలయ నియమ నిబంధనలను మార్చేస్తున్నారని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా వారు, రాజకీయ నాయకుల కోసం భజన చేస్తూ ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్న వారూ ఉన్నారన్నారు. తోమాల సేవ లాంటి ముఖ్య సేవలకు కూడా బలం, బలగంతో వచ్చేస్తున్నారని, శాస్త్ర విరుద్ధంగా నిర్వహిస్తూ మహాపచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయంలో పెరుగుతున్న మహాపచారాల కారణంగానే పిడుగులు, ఉరుములు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయన్నారు. ఇది స్వామివారి ఆగ్రహమేనని స్పష్టం చేశారు. స్వామివారి సేవకంటే తమ వారి సేవకోసం కైంకర్యాల సమయాలను తగ్గించి మమ అనిపిస్తున్నారని ఆరోపించారు. ఇది మహాపాపం అని హెచ్చరించారు. 1996 వరకు వంశపారంపర్యంగా స్వామివారి ఆభరణాలను సంరక్షిస్తూ వచ్చామని అయితే ఇప్పుడు వాటికి లెక్కలు, జవాబులు చెప్పే వాళ్లే కరువయ్యారన్నారు. అసలు స్వామివారి ఆభరణాలు అన్నీ భద్రంగా ఉన్నాయా..? అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
కట్టడాలు, ఆచారాలు కనుమరుగు చేసే యత్నం
శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన ఆభరణాల పరిస్థితి ఏమిటో? అని రమణ దీక్షితులు ప్రశ్నించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నియమించిన ఐఏఎస్ అధికారి అప్పట్లో వెయ్యికాళ్ల మండపం కూల్చివేశారన్నారు. ఇది ఆగమశాస్త్రాలకు విరుద్ధమని పోరాడామని, ఇప్పుడు ఆ ఆనవాళ్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి రథమండపం కోసం కూడా పోరాడినా రక్షించుకోలేక పోయామన్నారు. స్వామికి పాలకులు చేసిన మహా అపరాధాల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్నారు. భావితరాలకు వారసత్వ నిర్మాణాలు, ఆచారాలు కనిపించకుండా ఈ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. మాస్టర్ ప్లాన్ అనే నినాదంతో ఆలయాన్ని, ఆగమ శాస్త్రాలను కాలరాసి ఏకంగా హిందుమతాన్ని కనుమరుగు చేసే భారీ కుట్ర జరుగుతున్నట్టుందని ఆందోళన వ్యక్తంచేశారు.
విస్తరణ పేరిట సర్వనాశనం
విస్తరణ పేరుతో స్వామివారి ఆలయాన్ని సర్వనాశనం చేస్తున్నారని రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. పురావస్తు శాఖ ద్వారా ఆలయాన్ని పరిశీలిస్తామంటే దాన్ని కూడా రాజకీయం చేశారని పేర్కొన్నారు. టీటీడీపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి , హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రాలు పంపారన్నారు. హుండీ ఆదాయం స్వామివారి సేవకోసం మాత్రమేనని, అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తమ ఊరిలో కల్యాణ మండపం నిర్మించుకునేందుకు రూ.10 కోట్లు అడుగుతున్నారంటే ప్రభుత్వం తీరు ఎలా ఉందో తేటతెల్లం అవుతోందన్నారు. అధికార పక్షం కనుసన్నల్లో జరుగుతున్న అవినీతి నుంచి ఆలయాన్ని, స్వామివారిని కాపాడుకోవడం కోసం తాము పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తమతోపాటు భక్తులు కూడా స్వామివారిని కాపాడుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు తమ స్వార్థం కోసం సేవల సమయాలను కుదించి, అర్చకులను బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఇలాంటి పిచ్చి చేష్టల వల్ల స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. పాలకుల పాపాల కారణంగా రాష్ట్రానికి, భక్తులకు అశాంతితో పాటు స్వామివారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజకీయ నాయకులే ఆలయాన్ని భ్రష్టు పటిస్తున్నారన్నారు. దేవాలయాలకు రాజకీయాల నుంచి విముక్తి కల్గించాల్సి ఉందన్నారు.
సీబీఐతో విచారణ జరిపించాలి...
స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని సైతం వ్యాపార కేంద్రంగా మారుస్తున్నారని రమణ దీక్షితులు పేర్కొన్నారు. అతి ప్రాచీన ఆలయాన్ని కేంద్ర నిపుణుల కమిటీతో పరిరక్షించాలని కోరారు. పురావస్తు, ఆగమ శాస్త్ర పండితులు, ఆభరణాల నిపుణులు, స్వామివారి సేవే పరమావధిగా భావించే సీనియర్ అధికారులను ఈ కమిటీలో నియమించాలని సూచించారు. తిరుమల ఆలయంలోకి అన్యమతస్తుల ప్రవేశ విషయాన్ని రాజకీయాల విచక్షణకే వదలి పెడుతున్నామన్నారు. చరిత్ర తెలియని పాలకమండలి అధికారుల వల్ల ఆలయ ప్రతిష్ట మంట కలుస్తోందన్నారు. తిరుమల ఆలయంలో సాగుతున్న వ్యవహారాలపై సీబీఐతో విచారణ జరిపించాలని రమణ దీక్షితులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment