మూడో విడత మనగుడి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఎంజీ గోపాల్ బుధవారం తిరమలలో ప్రారంభించారు. ఈ రోజు శ్రావణ మాసంలోని శ్రవణా నక్షత్రంలో వివిధ ప్రాంతాల్లోని సుమారు 20వేల ఆలయాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని ఆలయాలకు శ్రీవారి సారె మనగుడిలో పాల్గొనే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేందుకు టీటీడీ సారెను ఇప్పటికే సిద్ధం చేసింది. 250 గ్రాముల పసుపు, 250 గ్రాముల కుంకుమ, 100 గ్రాముల అక్షింతలు , కిలో కలకండ, 1000 కంకణాలతో కూడిన అట్టపెట్టలతో కూడిన సారెను ఆలయాలకు తరలించింది.
అంతకుముందు టీటీడీ ఉన్నతాధికారులు, అర్చకులు ఈ సారెను గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక దాతల సహకారంతో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు రక్షాబంధన్ కావటంతో అవసరమైన కంకణాలను కూడా ముందే వివిధ ప్రాంతాల్లోని ఆలయాలకు చేరవేశారు. నేడు శ్రావణ పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి తిరుమలలో పున్నమి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. ప్రతి పౌర్ణమి రోజున గరుడ సేవ నిర్వహించటం ఆనవాయితీ. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఈ వాహన సేవను వైభవంగా నిర్వహించనున్నారు.
నవతరానికి ఆలయాలు, సంస్కృతి మూలాలు, సంప్రదాయాల విశిష్టత తెలపటంతోపాటు ఆదరణకు నోచుకోని ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావాలన్న సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ‘మనగుడి’ కార్యక్రమానికి గతంలో శ్రీకారం చుట్టింది. జాతికి ఆధారంగా నిలిచే గుడి సంస్కృతిని భావితరాలకు అందించే లక్ష్యంగా ‘మనగుడి’ని టీటీడీ ప్రారంభించింది. 2012 ఆగస్టు 2వ తేదీ వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో 13,212 ఆలయా ల్లో ఈ మనగుడి మహోత్సవాన్ని తొలిసారిగా నిర్వహించారు. 2012 నవంబరు 28వ తేదీ కార్తీక మాసంలో మొత్తం 17,536 ఆలయాల్లో రెండో విడత నిర్వహించిన సంగతి తెలిసిందే.