
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని అంజలిని పరామర్శిస్తున్న తహసీల్దార్ నాగేంద్ర
శింగనమల: ముగ్గిన కారం బొంగులు తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సలకంచెరువు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు మంగళవారం అధికమోతాదులో కారం ఉండి, ముగ్గిపోయి ఉన్న బొంగులను ఒక పాత్రలో ఉంచారు. ఉదయం 11 గంటల సమయంలో అటుగా వెళ్లిన దాదాపు 20 మంది విద్యార్థులు ఆ బొంగులు తిన్నారు. మధ్యాహ్న సమయానికి ఆ విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, ఉపాధ్యాయులు వెంటనే గుర్తించి ఏఎన్‌ఎం శైలజ చేత ప్రథమ చికిత్స చేయించి శింగనమల సీహెచ్‌సీ(సామాజిక ఆరోగ్య కేంద్రం)కి తీసుకెళ్లారు. సీహెచ్‌ఓ డాక్టర్ కృష్ణమూర్తి వైద్యం అందించారు. తహాసీల్దారు నాగేంద్ర, తరిమెల ఎంపీహెచ్‌ఓలు శివప్రసాద్, వెంకటరమణ, వారి సిబ్బంది విద్యార్థులను పరామర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన అంజలి, ప్రవల్లిక ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎటువంటి ప్రమాదమూ లేదన్నారు. ఎక్కువ కారం ఉన్న బొంగులు తినడం వల్ల వాంతి చేసుకున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment