సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దొంగతనం జరిగిందని అక్కడున్న వాచ్‌మన్ తెలిపారు. కరెంటు పనిచేయాలంటూ రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తోసేసి కంప్యూటర్లతో పరారైయ్యారని చెప్పారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నట్టు కోడెల శివప్రసాదరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చోరీ జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోడెల నివాసంలోని ఫర్నీచర్‌ను పరిశీలించేందుకు నేడు అసెంబ్లీ అధికారులు రాబోతున్న సమయంలో దొంగతనం జరగడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కంప్యూటర్లల్లో నిక్షిప్తమైన కీలక సమాచారాన్ని మాయం చేసేందుకే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారన్న ఊహాగానాలు రేగుతున్నాయి. దుండగులు పడేసిన కంప్యూటర్ మానిటర్‌ను సెక్యురిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే సమాచారం నిక్షిప్తమైవుండే సీపీలను దుండగులు ఎత్తుకెళ్లడం చూస్తుంటే ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగినట్టుగా ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
అసెంబ్లీ నుంచి విలువైన వస్తువులను సత్తెనపల్లిలోని తన ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్టు కోడెల ఇప్పటికే ఒప్పుకున్నారు. ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని, లేకుంటే ఆ ఫర్నీచర్ ధర ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానంటూ వితండ వాదనకు దిగారు. కోడెల కక్కుర్తిపై ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టారు. (చదవండి: ‘కే’ మాయ)
Comments
Please login to add a commentAdd a comment