మండల కేంద్రంలోని ధనగర్‌గల్లీకి చెందిన ఉపాధి హామీ కూలీ కోడేళ్ల పోతన్న (60) పాము కాటుతో బుధవారం మృతిచెందాడు.
ముథోల్, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని ధనగర్‌గల్లీకి చెందిన ఉపాధి హామీ కూలీ కోడేళ్ల పోతన్న (60) పాము కాటుతో బుధవారం మృతిచెందాడు. ముథోల్ నుంచి హాంగిర్గా వరకు చేపట్టిన ఉపాధి హామీ రోడ్డు పనుల్లో మంగళవారం పోతన్న పాల్గొన్నాడు. పనిచేస్తుండగా అతడి ఎడమ కాలుపై పాము కాటేసింది. గమనించిన సహచర కూలీలు వెంటనే అతడిని ముథోల్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు రాత్రి భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆస్పత్రికి రెఫర్ చేయగా, అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పోతన్న మృతిచెందాడు. కుటుంబ పెద్దదిక్కు పోతన్న ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోతన్నకు భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్యాంసుందర్ తెలిపారు. కాగా, ప్రభుత్వం పోతన్న కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కూలీలు కోరుతున్నారు.
పత్తి ఏరుతుండగా..
దహెగాం : మండలంలోని కేస్లాపూర్‌లో పత్తి ఏరుతుండగా పాము కాటు వేయడంతో డోంగ్రె తారాబాయి(60) చనిపోరుునట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కాగజ్‌నగర్ మండలం సీతానగర్‌కు చెందిన తారాబాయి కేస్లాపూర్‌లో ఉంటున్న కూతురు దుర్గం శారద ఇంటికి వారం రోజుల క్రితం వచ్చింది. మంగళవారం సాయంత్రం కూతురి చేనులో పత్తి ఏరుతుండగా తారాబారుుని పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం తారాబారుు చనిపోరుుందని ఎస్సై తెలిపారు. శారద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.