అందివస్తారనుకుంటే అందకుండానే పోయారా...పదహారు సంవత్సరాలు కళ్లల్లో పెట్టుకుని పెంచుకుంటే గేదెల కోసం వెళ్లి గల్లంతయ్యారా..దేవుడా ఎందుకింత కష్టం తెచ్చిపెట్టావు...ఇప్పుడు ఎవరిని చూసుకుని బతకాలి... ఏం పాపం చేశామని ఇంత శిక్ష వేశావు... అంటూ ఆ రెండు కుంటుంబాలు విలపిస్తున్న తీరు చూపరుల కంట తడి పెట్టించింది. స్నానం చేసేందుకు కృష్ణా నదిలో దిగిన ఇద్దరు విద్యార్థులు గల్లంతు కావడం ఆ రెండు ఇళ్లల్లో విషాదాన్ని నింపింది.
- కృష్ణా నదిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
- రెండు కుటుంబాల్లో విషాదం
అమరావతి: మండల కేంద్రం అమరావతి బండచేను కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థులు అదివారం సాయంత్రం కృష్ణానదిలో మునిగి గల్లంతయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఓపెన్ టెన్త్ చదువుతున్న నాగుల్‌మీరా, అతని స్నేహితుడు వి. సూర్యవంశీతో పాటు అదేకాలనీకి చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్ననాగుల్‌మీరా, ఇంటర్మీడియెట్ చదువుతున్న మరో స్నేహితుడు వీరేంద్రతో కలసి తప్పిపోయిన గేదెలను వెతికే క్రమంలో వైకుంఠపురం డొంకలోని పాత ఇసుకరేవుకు చేరుకున్నారు.
ఈ సమయంలో వీరేంద్ర, తొమ్మిదవ తరగతి చదువుతున్న నాగుల్‌మీరా నది ఒడ్డున గేదెలను వెతుకుతుండగా సూర్యవంశి, నాగుల్‌మీరా స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నదిలో మునిగి గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరు స్నేహితులు గ్రామంలోకి వచ్చి తల్లిదండ్రులకు, బంధువులకు సమాచారం అందించటంతో గ్రామస్తులు, పోలీసుల సహాయంతో సుమారు రెండు మూడు గంటల పాటు గజ ఈతగాళ్లు నదిలో గాలించినా జాడ కానరాలేదు.
పదహారు సంవత్సరాలు పెంచిన కుమారులు గల్లంతయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నది ఒడ్డుకు చేరుకుని బోరున విలపించటం గ్రామస్తులను కలచివేసింది. వచ్చేనెలలో జరిగే ఓపెన్ టెన్త్ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు నదిలో గల్లంతుకావటంతో బంధువులు కంటతడి పెట్టారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఫలితం లేకపోవటంతో సోమవారం మరో మారుగాలింపు చర్యలు చేపడతామని ఎస్‌ఐ వెంకటప్రసాద్ తెలిపారు.
దేవుడా...!
Published Mon, Apr 27 2015 2:37 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement