ఏఎన్‌యూ ఆన్‌లైన్ కేంద్రంలో సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకుంటున్న నిరుద్యోగులు
ఏఎన్‌యూ(గుంటూరు): నిరుద్యోగులకు చేయూత పేరుతో ప్రవేశపెట్టిన యువనేస్తం పథకం అస్తవ్యస్తంగా తయారయ్యింది. యువనేస్తం కింద ఆర్థిక సహాయం చేసే సంగతి దేవుడెరుగు.. కనీసం దరఖాస్తు ప్రక్రియ కూడా సక్రమంగా అమలు చేయటం లేదంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే దీన్ని ప్రవేశపెట్టారని విమర్శిస్తున్నారు. పలు రకాల నిబంధనలు విధిస్తూ నెలల తరబడి దరఖాస్తు కేంద్రాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వర్సిటీ కళాశాలల్లో చదివారని..
యువనేస్తం పథకం కింద నిరుద్యోగ భృతి పొందేందుకు అర్హులైన వారు గత ఏడాది సెప్టెంబర్‌లోనే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలా మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేయలేదు. తమను ఎందుకు ఎంపిక చేయలేదని యువనేస్తం టోల్‌ఫ్రీ నంబర్, సంబంధిత అధికారులను సంప్రదించగా మీరు తెలంగాణ ప్రాంతంలోని వర్సిటీకి అనుబంధంగా ఉన్న కళాశాల్లో డిగ్రీ చదివారని కొందరికి, దూరవిద్యాకేంద్రం ద్వారా డిగ్రీ చదివారని మరికొందరికి సమాధానాలొచ్చాయి. దీంతో ఇంటర్మీడియట్ వరకు ఏపీ ప్రాంతంలో చదివి డిగ్రీ మాత్రమే తెలంగాణ ప్రాంతంలో చదివిన విద్యార్థులు కూడా యువనేస్తం పథకానికి ఎంపిక కాలేకపోయారు.
పరిశీలన పేరుతో..
తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో, దూరవిద్యలో డిగ్రీలు చదివిన వారి దరఖాస్తులు ఆమోదించకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని బాధిత నిరుద్యోగులు సంబంధిత అధికారులను ప్రశ్నించగా.. డిగ్రీ సర్టిఫికెట్లు వెరిఫై చేసేందుకు సంబంధిత యూనివర్సిటీలు డేటా పంపలేదని, జన్యూనిటీ వెరిఫై చేయించుకుని రావాలని సలహా ఇచ్చినట్లు బాధిత నిరుద్యోగులు వాపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని యూనివర్సిటీలు, ఏపీలోని యువనేస్తం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం ఇవ్వడంలోనూ నిర్లక్ష్యమే..
తెలంగాణ ప్రాంతంలో చదివిన వారికి, పలు కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తు దారులకు సర్టిఫికెట్ల పరిశీలన, అప్‌లోడ్‌కు హాజరుకావాలని రెండు రోజుల కిందట రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేరుతో మెస్సేజ్‌లు వచ్చాయి. దీనికి సంబంధిత షెడ్యూల్, సర్టిఫికెట్ల పరిశీలన జరిగే కేంద్రాల జాబితా ఉన్న వెబ్‌సైట్‌ను నిరుద్యోగులకు పంపించారు. ఈ క్రమంలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం వందల మంది మంగళవారం ఏఎన్‌యూ ఆన్‌లైన్ సెంటర్లో ఉన్న యువనేస్తం కార్యాలయానికి వచ్చారు. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించారు. అప్‌లోడ్‌కు సంబంధించి ఎవరు సమాచారమిచ్చారో తమకు తెలియదని రిజిస్ట్రార్ కార్యాలయం అధికారుల చెప్పగా వచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు అవాక్కయ్యారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన కొందరు విద్యార్థులు తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి సిబ్బంది కూడా తమ వద్ద సమాచారమేమీ లేదని తేల్చి చెప్పారు. దీంతో కొందరు విద్యార్థులు యువనేస్తం పథకానికి సంబంధించిన టోల్‌ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించగా షెడ్యూల్ ఎవరిచ్చారో తమకు కూడా తెలియదని సమాధానం వచ్చింది. ఉన్నత విద్యామండలి పేరుతో మెస్సేజ్ వచ్చిందని చెప్పగా వారినే సంప్రదించండని చెప్పడం గమనార్హం. చివరికి విద్యార్థులు ఆందోళనకు దిగాలని భావిస్తున తరుణంలో ఏఎన్‌యూలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించారు. దరఖాస్తు ప్రక్రియలోనే స్పష్టత లేకపోతే ఇక లబ్ధిదారుల ఎంపికలో సంబంధిత అధికారులు ఏం శ్రద్ధ తీసుకుంటారని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొందరికి ఇచ్చి ఇంకొందరికి ఆపేయడమేంటి?
తెలంగాణ ప్రాంతంలోని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ చదివిన వారి సర్టిఫికెట్ల పరిశీలన చేయని కారణంగా ఈ పథకానికి ఎంపిక చేయలేదని అధికారులు చెప్పారు. కానీ, జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలో బీటెక్ చదివిన మా స్నేహితుడిని ఎంపిక చేశారు. కొందరి దరఖాస్తులు ఎందుకు తిరస్కరిస్తున్నారో సరైన కారణం చెప్పే వారే లేరు. మేం మాత్రం ఐదు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం.–టి.కిషోర్, తిరువూరు
స్పష్టత లేని సమాచారంతో ఇబ్బందులు
సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని మూడు రోజుల కిందట రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేరుతో నా మొబైల్‌కు మెస్సేజ్ వచ్చింది. దగ్గర్లోని సెంటర్‌కు ఎక్కడికైనా వెళ్లి పరిశీలన చేయించుకోవచ్చని కూడా అందులో పేర్కొన్నారు. దీంతో నేను ఏఎన్‌యూకి వచ్చాను. సెంటర్‌కు తాళాం వేసి ఉంది. ఎవర్ని అడిగినా మాకు తెలియదని చెబుతున్నారు. ఇప్పటికి ఐదు నెలలుగా తిరుగుతూ ఉన్నాం. –కె.రాజశేఖర్‌రెడ్డి, నందిగామ
ఉన్నత విద్యామండలికి కూడా తెలియదట..
సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని రెండు రోజుల కిందట నాకు ఉన్నత విద్యామండలి పేరుతో మెస్సేజ్ వచ్చింది. ఏఎన్‌యూకి వస్తే ఈ విషయంపై మాకు సమాచారం లేదన్నారు. దీంతో మా స్నేహితులతో కలిసి తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయానికి వెళ్లాం. అక్కడ ఉన్న ఉద్యోగి దీనిపై మాకు సమాచారం లేదని టోల్‌ఫ్రీ నంబరులో సంప్రదించాలని సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే ఎవరు మెస్సేజ్ చేశారో వాళ్లనే అడగాలని చెప్పారు. – ఈ.అశోక్ రెడ్డి, నందిగామ
Comments
Please login to add a commentAdd a comment