
విపత్త్తులను ముందే పసిగట్టగలం
- టీఈడబ్ల్యూసీ సదస్సులో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్
- కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్
- పదేళ్ల కిందటి సునామీ బాధితులకు ఇంకా పునరావాసం అందలేదని వ్యాఖ్య
- టీఈడబ్ల్యూసీ సదస్సులో ప్రసంగించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: సునామీ, తుపాను, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగ ట్టే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. హైదరాబాద్‌లోని భారత జాతీయ మహా సముద్రాల సమాచార వ్యవస్థ (ఇన్‌కాయిస్) ప్రాంగణంలో ఉన్న ‘సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రం (టీఈడబ్ల్యూసీ)’ ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ కలిగిన కేంద్రంగా పేరుగాంచిందని ఆయన చెప్పారు.
‘టీఈడబ్ల్యూసీ సాధించిన పురోగతి, భవిష్యత్ సవాళ్లు’ అనే అంశంపై శుక్రవారం ‘ఇన్‌కాయిస్’లో జరిగిన సదస్సులో హర్షవర్ధన్ మాట్లాడారు. ఏడేళ్ల కింద ఏర్పాటైన సునామీ హెచ్చరికల కేంద్రం దేశవ్యాప్తంగా సముద్ర తీరాల్లో 350 చోట్ల పరికరాలను ఏర్పాటు చేసుకుని, తీరప్రాంత ప్రజలకు నిత్యం ప్రమాద హెచ్చరికలను అందజేస్తోందని తెలిపారు. పదేళ్ల కింద 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీతో దేశవ్యాప్తంగా వేలాదిమంది చనిపోయారని, తల్లిదండ్రులను కోల్పోయి ఎంతోమంది చిన్నారులు అనాథలయ్యారని ఆయన పేర్కొన్నారు.
ఆ ఘటన జరిగి పదేళ్లుదాటినా గత ప్రభుత్వాలు బాధితులకు సరైన పునరావాసం కల్పించలేకపోయాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 26 శాతం మంది ప్రజలు సముద్రతీరానికి సమీపంలో నివసిస్తున్నారని, వైపరీత్యాల సమయంలో వారి ప్రాణాలను రక్షించేందుకు టీఈడబ్ల్యూసీ కేంద్రం ఎంతగానో దోహదపడుతోందని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ కేంద్రం ఇచ్చిన సమాచారంతో ఇటీవలి హుద్‌హుద్ తుపాను నుంచి ఎక్కువ ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోగలిగామన్నారు. హిందూ, పసిఫిక్ మహా సముద్రాల పరిధిలోని 16 దేశాలకు ఈ సునామీ హెచ్చరికల కేంద్రం సేవలందిస్తోందని హర్షవర్ధన్ చెప్పారు.
వైపరీత్యాల నిర్వహణపై శిక్షణ..
ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లకు శిక్షణ ఇప్పించే యోచన చేస్తున్నామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి తెలిపారు. జపాన్ వంటి దేశాలు తమ సునామీ హెచ్చరికల కేంద్రాన్ని రూ. 1,200 కోట్లతో ఏర్పాటు చేసుకోగా... మనదేశంలో కేవలం రూ. 240 కోట్లతో ఏర్పాటైన టీఈడబ్ల్యూసీ ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా నిలిచిందని చెప్పారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలతో సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఇటువంటి వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోగలమని ఆయన వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి శైలేశ్‌నాయక్, మాజీ కార్యదర్శులు పీఎస్ గోయల్, హర్షగుప్తా, ఇన్‌కాయిస్ డెరైక్టర్ సతీష్ షెనాయ్ తదితరులు పాల్గొన్నారు.
పోలియో సమూల నిర్మూలనకు వ్యాక్సిన్
పోలియో వ్యాధి సమూల నిర్మూలనకు, రాబోయే తరాలు దీని బారిన పడకుండా ఉండేందుకు పకడ్బందీ వ్యాక్సిన్ తయారీకి చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోది ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రణాళికలను సాకారం చేసే దిశలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) రంగంలో వివిధ ప్రాజెక్టులను రూపుదిద్దేక్రమంలో తమ శాఖ కీలకపాత్రను పోషించనున్నదని చెప్పారు. సునామీ హెచ్చరికలపై హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ ఐఐసీటీ, ఐఐటీ, ఐఐఎం, తదితరాల ఆర్ అండ్ డి సెంటర్లను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఉత్తరాదిలో బీజేపీ బలంగా ఉన్నా, దక్షిణాదిలో ఎందుకు అంతగా పుంజుకోలేకపోతోందన్న ప్రశ్నకు ఈ రాష్ట్రాల్లో కూడా పార్టీ ఉందని, పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందన్నారు. వారంతా స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని, దీనిని పార్టీ కార్యకర్తలు బలంగా ఉపయోగించుకోవాలన్నారు. కేంద్రమంత్రికి స్వాగతం పలికిన వారిలో బీజేఎల్పీ నేత డా.కె.లక్ష్మణ్, పార్టీ నేతలు ప్రకాష్‌రెడ్డి, హనీఫ్ అలీ, ఎం. చంద్రయ్య తదితరులున్నారు.