సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్య ఉద్యమానికి తాత్కాలిక తెర పడింది. రెండు నెలల పాటు ఉద్యమ సిపాయిలై రోడ్డెక్కిన ఉద్యోగులు ఇక కార్యాలయాల వైపు అడుగులేశారు. మొదటి రోజు శుక్రవారం విధులకు హాజరైన కొందరు అధికారులు, సిబ్బందిలో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది. తప్పదన్నట్లుగా వారి సీట్లకు పట్టిన దుమ్ము దులిపి.. బూజుపట్టిన ఫైళ్లను కదిలించే ప్రయత్నం చేశారు. వీరి తరహాలోనే కంప్యూటర్లు, ఫ్యాన్లు మొరాయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌లైన్’ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విజిట్ నిర్వహించింది. పాలనకు కేంద్ర బిందువైన కలెక్టరేట్‌లోనే చాలా మంది ఉద్యోగులు ఆలస్యంగా విధులకు హాజరవడం కనిపించింది.
తీరిగ్గా 11 నుంచి 12 గంటల మధ్యలో వారి రాక నత్తలను తలపించింది. నగరంలోని జిల్లా పరిషత్, ఆర్డీఓ కార్యాలయాల్లోనే ఇదే తరహా దృశ్యాలే. ఇక ఆర్డీఓ కుర్మానాథ్ కార్యాలయం వైపే రాకపోవడం గమనార్హం. అదే విధంగా జిల్లాలోని తహశీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ అధికారులు కొందరు మొదటి రోజు కదా అన్నట్లు ఆలస్యంగా రాగా.. మరికొందరు సొంతంగా సెలవు ప్రకటించేసుకున్నారు.
ఇంకొందరైతే కార్యాలయానికి వచ్చి హాజరుపట్టీలో సంతకం చేసి తిరిగి వెళ్లిపోవడం వారి కోసం పడిగాపులు కాసిన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలాఉండగా చాలా కాలం తర్వాత కార్యాలయాలు తెరుచుకోవడంతో సిబ్బంది కుర్చీలతో పాటు వివిధ ఫైళ్లు సైతం దుమ్ముపట్టిపోయాయి. కలెక్టరేట్‌లోని ఏ, బీ, సీ తదితర సెక్షన్లలో కంప్యూటర్లు మొరాయించారు. కొన్ని విభాగాల్లో ఫ్యాన్లు పనిచేయకపోవటంతో ఉద్యోగులు వాటితో కుస్తీ పట్టడంతోనే సరిపోయింది. జిల్లాలోని పలు కార్యాలయాల్లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.
కాగా పలు సమస్యలతో ప్రజలు పెద్ద ఎత్తున కార్యాలయాలకు చేరుకున్నారు. ముఖ్యంగా జనన మరణ, కుల, ఆదాయ, పట్టాదారు పాసుపుస్తకాల కోసం క్యూకట్టారు. అయితే కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో లేకపోవడం వారిని నిరాశకు గురిచేసింది. మున్సిపల్ కార్యాలయాల్లో ఇంటి, నీటి పన్నుల చెల్లింపులు పెద్ద ఎత్తున జరిగాయి. ఒక్క కర్నూలు కార్పొరేషన్‌లోనే రూ.31 లక్షలకు పైగా వసూలవడం విశేషం. జిల్లా వ్యాప్తంగా ఈ మొత్తం రూ.2 కోట్లకు పైమాటేనని అధికారుల ద్వారా తెలిసింది.
హా..జరు!
Published Sat, Oct 19 2013 4:09 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement
Advertisement