జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కేంద్రం దిగివచ్చే వరకు ఆందోళనలు ఆగవని స్పష్టం చేస్తున్నారు.
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కేంద్రం దిగివచ్చే వరకు ఆందోళనలు ఆగవని స్పష్టం చేస్తున్నారు. ఉద్యమంలో భాగంగా 31వ రోజైన శుక్రవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఒంగోలు నగరంలో పంచాయతీరాజ్, జెడ్పీ, ఐసీడీఎస్, డ్వామా శాఖలకు చెందిన దాదాపు 300 మంది ఉద్యోగులు
కలెక్టరేట్ ఎదుట సామూహిక రిలే దీక్షలు చేపట్టారు. అన్ని శాఖలకు చెందిన దాదాపు 3 వేల మంది ఉద్యోగులతో నగరంలో కలెక్టరేట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల జెండాలు, నోటికి నల్లరిబ్బన్లతో మౌన ప్రదర్శన చేపట్టారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూల్‌రోడ్డు ఫ్లైఓవర్ నుంచి చర్చి సెంటర్ వరకు భారీ జాతీయ జెండా ప్రదర్శించారు. సమైక్యాంధ్ర ఫ్రంట్ నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. నగరంలోని పలు కళాశాలలకు చెందిన వందల మంది విద్యార్థులు కర్నూలు రోడ్డులోని ముంగమూరు బైపాస్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.
కొనసాగుతున్న ఆందోళనల పర్వం:
అద్దంకిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు విభిన్న వేషధారణలతో దేశభక్తిని చాటారు. మేదరమెట్ల- నార్కెట్‌పల్లి రహదారిపై ఓ విద్యార్థి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించాడు. ఐకమత్యమే బలం అంటూ బాలికలు సమైక్యత గొప్పదనాన్ని చాటేలా నృత్యాన్ని ప్రదర్శించారు. అద్దంకిలోని బంగ్లా రోడ్‌లో ఏపీటీఎఫ్ టీచర్ల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలల యజమానుల దీక్షలు 11వ రోజుకు చే రాయి. బస్టాండ్ ఆవరణలో ఎన్‌జీఓలు, ఆర్టీసీ ఉద్యోగుల రిలే దీక్షలు 8వ రోజుకు చేరాయి. పంగులూరులో తెలుగు తల్లి వేషధారణ, ఎన్‌సీసీ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. చీరాలలో ప్రింటింగ్ ప్రెస్, బైడింగ్, జెరాక్స్ షాపుల యజమానులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి నిరసనకు దిగారు. పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టి సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వ మహిళా కళాశాలకు చెందిన విద్యార్థినులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి మున్సిపాలిటీ వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వేటపాలెంలో రజకులు నిరసన వ్యక్తం చేశారు.
ముస్లింల భారీ ర్యాలీ:
సమైక్యాంధ్రను కాంక్షిస్తూ దర్శిలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. కందుకూరులో దాదాపు 1500 మంది ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ బొమ్మ సెంటర్లో ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ మహిళా కండక్టర్ రజని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రిలే దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు. తోటి ఉద్యోగులు ఆమెను ఘనంగా సన్మానించారు. కనిగిరిలో ఆల్ఫా, కేటీఆర్ స్కూల్, ప్రతిభ స్కూల్ విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పామూరు బస్టాండ్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. కోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు సమైక్యాంధ్రకు మద్దతుగా 8వ రోజు రిలే దీక్షలో కూర్చున్నారు. వైఎస్‌ఆర్ టీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. సీఎస్ పురంలో పశువర్థక శాఖ ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
మార్కాపురంలో వినూత్న నిరసన
మార్కాపురంలో ప్రైవేటు కాన్వెంట్స్ టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యాయులు ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి రిలేదీక్షలు చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలకు సెలవులు ప్రకటించారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు అర్జునుడు, భీముడు, ధర్మరాజు, ద్రౌపతి వేషాలతో నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి కోర్టు సెంటర్‌లో మానవహారం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. తర్లుపాడులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధి కూలీలు వరుసగా 10వ రోజూ నిరసన వ్యక్తం చేశారు. పొదిలి పట్టణంలో లారీ యజమానులు లారీలతో భారీ ప్రదర్శన చేపట్టారు. పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామంలోని వెలిగొండ ప్రాజెక్టు డ్యామ్ వద్ద నుంచి వైపాలెం ఎమ్మెల్యే సురేశ్ సమైక్యాంధ్రకు మద్దతుగా పాదయాత్ర మొదలుపెట్టారు. శ్రీశైలం వరకు పాదయాత్ర కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు.
యర్రగొండపాలెంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్స్ అసోసియేషన్, వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి వంటా-వార్పు కార్యక్రమంతో రోడ్డుపైనే భోజనాలు చేసిన నిరసన వ్యక్తం చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఏపీ ట్యుటోరియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం చేపట్టారు. అలాగే టెన్నిస్ క్లబ్ ఆధ్వర్యంలో రోడ్డుపైనే ఆటోలతో నిరసన తెలిపారు. కొమరోలులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆటో యునియన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం సోనియాగాంధీ దిష్టిబొమ్మని దహనం చేశారు. కంభంలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టగా, రిక్షా కార్మికులు ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలు చేశారు. అర్థవీడులో ఉపాధ్యాయులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడులో ఆరోగ్యకార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.