కల్తీ ఆహారం..క్యాన్సర్‌ కారకం | Unusual Food Habits Leading To Stomach Cancer | Sakshi
Sakshi News home page

కల్తీ ఆహారం..క్యాన్సర్‌ కారకం

Published Sun, Apr 8 2018 2:57 PM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM

Unusual Food Habits Leading To Stomach Cancer - Sakshi

ఆధునిక నగర జీవనం నేటి యువత జీవన ప్రమాణాలను ప్రమాదకర స్థితిలోకి నెట్టివేస్తోంది. వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియకపోయినా...నడి వయసుకు వచ్చేసరికే క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులు బయటపడుతూ వారిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కృంగదీస్తున్నాయి. సమయపాలన లేని ఆహార నియమాలు, ఆహారంలో కల్తీ, జీవనశైలి మార్పులు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో నమోదవుతున్న క్యాన్సర్‌ కేసులు నిపుణులను సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్య వయస్సులోనే అన్నవాహిక క్యాన్సర్, జీర్ణాశయ, పెద్దపేగు, గర్భాశయ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు ఇటీవల సర్వేల్లో వెల్లడైంది. దీనిపై ‘సాక్షి’ కథనం..

లబ్బీపేట(విజయవాడ తూర్పు): సమయపాలన లేని ఆహారపు అలవాట్లు కొంప ముంచుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రెస్టారెంట్‌లు, ఫుడ్‌ కోర్టుల్లో బిర్యానీలు లాగించేస్తుండడంతో తొలుత జీర్ణాశయ వ్యాధులు. అనంతరం క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. ఇటీవల నగరంలో నమోదవుతున్న క్యాన్సర్‌ కేసులు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నట్టు వైద్యులు చెపుతున్నారు. నాలుగు పదుల వయస్సులోనే జీర్ణాశయ, పెద్దపేగు, లివర్‌ క్యాన్సర్‌  సోకుతున్నట్టు వైద్యులు చెపుతున్నారు. ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే రానున్న కాలంలో పెనుముప్పు పొంచి ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు. 

గాంధీనగర్‌కు చెందిన 42 ఏళ్ల వ్యాపారి శ్రీనివాస్‌(పేరుమార్చాం) అర్ధరాత్రి వరకూ బిజినెస్‌ వ్యవహారాలు చూస్తుంటారు. అనంతరం తరచూ స్నేహితులతో కలిసి బయట ఎక్కువగా నాన్‌వెజ్‌ వంటకాలు తింటుంటారు. ఇటీవల తరచూ కడుపునొప్పి రావడం, అరుగుదల తగ్గడంతో వైద్యుని వద్దకు వెళ్లారు.అక్కడ పరీక్షలు జరిపి జీర్ణాశయ క్యాన్సర్‌ వచ్చినట్టు నిర్ధారించారు. ∙పశ్చిమ కృష్ణాకు చెందిన ఓ ఉద్యోగి వారంలో నాలుగు రోజులు బయట హోటళ్లలో భోజనం చేస్తుంటారు.

నాన్‌వెజ్, బిర్యానీలు లాగించేస్తుంటారు. దీంతో అతనికి తరచూ కడుపునొప్పితో పాటు, విరోచనంలో రక్తం పడడంతో అనుమానం వచ్చి వైద్యుడిని సంప్రదించారు. పెద్ద పేగు క్యాన్సర్‌గా నిర్ధారించారు.ఇలా వీరిద్దరే కాదు.. ఇటీవల వైద్యులను సంప్రదిస్తున్న వారిలో పెద్దపేగు, జీర్ణాశయ, లివర్‌ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా వస్తున్నట్టు చెపుతున్నారు. అందుకు కల్తీ ఆహారమే కారణంగా చెపుతున్నారు. 

కొంప ముంచుతున్న కల్తీ ఆహారం
నాన్‌వెజ్‌ వంటకాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనాలు కలిసిన కారం పొడులు ఎక్కువగా వాడుతుంటారు.అంతేకాకుండా మృత జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన  కల్తీ నూనెలు ఎక్కువగా వినియోగించి వంటలు చేస్తుండడంతో జీర్ణకోశ వ్యాధులు పెరుగుతున్నట్టు చెపుతున్నారు, ఫుడ్‌ కంట్రోల్‌ శాఖ వారు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో కల్తీ ఆహారాన్ని గుర్తించడమే అందుకు నిదర్శనంగా చెపుతున్నారు. ఇప్పటికైనా బయట ఆహారం తినడం తగ్గించడం ఎంతో ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. 

పెరిగిన గర్భాశయ క్యాన్సర్‌
మహిళల్లో ఒకప్పుడు బ్రెస్ట్, సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ప్రస్తుతం సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులు తగ్గగా, జీవనశైలి కారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు క్యాన్సర్‌ వైద్య నిపుణులు చెపుతున్నారు. వీటితో పాటు గర్భాశయ క్యాన్సర్‌ కేసులు  కూడా పెరుగుతున్నాయని వైద్యులు చెపుతున్నారు. 

ముందుచూపే మందు
ఇటీవల కాలంలో జీర్ణాశయ, పెద్దపేగు క్యాన్సర్‌లు పెరిగాయి. అందుకు కల్తీ ఆహారం, నాన్‌వెజ్‌ ఎక్కువగా తీసుకోవడం కూడా కారణంగా చెప్పవచ్చు. ఆహార పదార్ధాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయట తినాలి. మాంసాహారంలో కలిపే రసాయనిక రంగులు క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి. మహిళల్లో శారీరక శ్రమ తగ్గడంతో రొమ్ము క్యాన్సర్‌తో పాటు, గర్భాశయ క్యాన్సర్‌ కేసులు అధికమయ్యాయి. పట్టణ వాసుల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. క్యాన్సర్‌ను ముందు జాగ్రత్తల ద్వారానే నివారించగలుగుతాం. 
 –డాక్టర్‌ ఎన్‌.సుబ్బారావు, మెడికల్‌ అంకాలజిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement