సాక్షి, బెంగళూరు: ప్రముఖ డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి తన ప్రదర్శనతో విద్యార్థులను ఉర్రూతలూగించాడు. రామయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(రిమ్స్) సంస్థ ‘ఉర్జా-2013’ పేరిట రిమ్స్ ప్రాంగణంలో నిర్వహించిన మూడు రోజుల నేషనల్ ఇంటర్ కాలేజ్ ఫెస్ట్ ముగింపు ఉత్సవాలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి.
ఈ సందర్భగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివమణి తన డ్రమ్స్ వాయిద్యంతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. అంతకుముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో శివమణి మాట్లాడుతూ దివంగత కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజ్‌కుమార్ తన ప్రదర్శనను ఎంతగానో మెచ్చుకునేవారని తెలిపారు.
ఉద్యాననగరిగా పేరుగాంచిన బెంగళూరు అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ‘రాగి ముద్దె’ తప్పక రుచిచూస్తానని పేర్కొన్నారు. రిమ్స్ డెరైక్టర్ ఎం.ఆర్.పట్టాభిరామ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సమాజసేవపై అవగాహన కల్పించడంలో భాగంగా ‘టైమ్ టు గివ్ బ్యాక్’ నినాదంతో ఈ ఫెస్ట్‌ను నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఫెస్ట్‌లో ఓటు హక్కు వినియోగంపై కూడా చైతన్యాన్ని కల్పించేందుకు వివిధ సెమినార్లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
‘ఉర్జా’లో శివమణి మోత
Published Mon, Dec 9 2013 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
Advertisement