ఏపీ రాజధానిలో వాతే!
సింగపూర్ సోకు.. ప్రజలకే షాకు!
బాబు యూజర్ చార్జీల బాట
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు మళ్లీ యూజర్ చార్జీల బాట పట్టారు. రాజధాని ప్రాంతంలో పన్నులు, చార్జీల మోత మోగిపోనుంది. ఒకవైపు రాజధాని ప్రాంత(సీఆర్‌డీఏ) పరిధిలోనూ, రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంస్థల పరిధిలోని ఖాళీ స్థలాలపై పన్నును పెంచేందుకు పురపాలక శాఖ రంగం సిద్ధం చేస్తోంది. నూతన రాజధాని నిర్మా ణం కోసమంటూ విరాళాలు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు రాజధాని నిర్వహణ వ్యయం మొత్తాన్ని యూజర్ చార్జీల రూపంలో ప్రజల నుంచే రాబట్టాలని నిర్ణయించింది. పారిశుధ్య నిర్వహణ మొదలు, రాజధానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ సింగపూర్ స్థాయిలో ప్రచారం చేస్తున్న బాబు సర్కారు.. నూతన రాజధానిలో కల్పించే అన్ని రకాల మౌలిక వసతులు, అందించే సేవలను వినియోగించుకునే వారందరి నుంచీ ఆ మేరకు యూజర్ (వినియోగ) చార్జీలను పూర్తి స్థాయిలో వసూలు చేయాలని నిర్ణయించింది.
అంతేకాదు వసూలు బాధ్యతను ఏదైనా సంస్థకు గానీ సంఘానికి గానీ అప్పగించనుంది. నూతన రాజధానిలో కల్పించే వసతులను వినియోగించుకునే వారి నుంచి యూజర్ చార్జీలను వసూలు సంబంధిత అంశాన్ని రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌డీఏ) బిల్లులో పొందుపరిచారు. యూజర్ చార్జీలను వసూలు చేసే అధికారాన్ని ఏదైనా ఏజెన్సీకి గానీ వ్యక్తికి గానీ, ఏదైనా సంస్థ లేదా ఆసోసియేషన్‌కు అథారిటీ కమిషనర్ అప్పగించవచ్చునని కూడా బిల్లులో పేర్కొన్నారు.
ఎన్నెన్ని చార్జీలో..!
రాజధానిలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు అమలు కోసం అథారిటీ ప్రత్యేక సెస్‌ను విధించనున్నట్లు బిల్లులో స్పష్టం చేశారు. అలాగే నూతన రాజధాని ప్రాంతంలో భూమి, భవనాలకు సంబంధించి ఎలాంటి వినియోగ మార్పిడి జరిగినా కచ్చితంగా ఫీజు వసూలు చేయనున్నారు. అలాగే అభివృద్ధి చార్జీలను కూడా అథారిటీ విధించనుంది. ఒకసారి అభివృద్ధి చార్జీలు చెల్లించిన తరువాత అక్కడే అదనంగా విస్తరణ చేపడితే కొత్తగా మరోసారి అభివృద్ధి చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అభివృద్ధి చార్జీని చెల్లించడంలో జాప్యం చేసినట్లైతే పీనల్ (జరిమానా) వడ్డీతో సహా వసూలు చేయనున్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా విధించే వడ్డీ రేటును వసూలు చేయాలని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక సీఆర్‌డీఏ పరిధిలో ఆయా ప్రాంతాల విలువ ఆధారంగా బెటర్‌మెంట్ చార్జీలను లేదా ప్రభావిత ఫీజు లేదా పట్టణ మౌలిక సదుపాయాల ఫీజును విధించే అధికారం కూడా అథారిటీకి కట్టబెట్టారు. ఇతర ఫీజులతో పాటు ల్యాండ్ పూలింగ్ పథకం లేదా పట్టణ ప్రణాళిక పథకం, లేదా నూతన రహదారి నిర్మాణం లేదా ఇతర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రభావిత ఫీజును అదనంగా వేసే అధికారం అథారిటీకి ఉంది. నూతన రాజధానిలో ఏదైనా ప్లాటు లేదా భూమికి సంబంధించిన ఫీజులను గడువులోగా చెల్లించకపోతే ఆ మరుసటి రోజునే అథారిటీ కమిషనర్ తదుపరి చర్యలు తీసుకోవచ్చునని బిల్లులో స్పష్టం చేశారు. చార్జీలు, ఫీజులు ఎంతెంత వసూలు చేయాలనే అంశంపై రాజధాని నిర్మాణ క్రమంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
స్పెషల్ పర్పస్ వెహికల్స్
నూతన రాజధానిలో పలు అవసరాల కోసం స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీలు)ను ప్రభుత్వ అనుమతితో అథారిటీ ఏర్పాటు చేసుకోవచ్చునని బిల్లులో తెలిపారు. ఎస్పీవీల్లో ప్రభుత్వ ప్రతినిధి ఉంటారని, ఈక్విటీ విషయం గానీ రుణం విషయం గానీ ప్రభుత్వ ప్రతినిధి పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.